నారా లోకేష్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా మారిన టీడీపీ నాయకుడు. 2019 ఎన్నికల్లో వచ్చిన ఓటమి, అలాగే ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ ఏర్పడ్డ దీన పరిస్థితి లోకేష్ లో చాలా మార్పులు తెచ్చిందని టీడీపీ నాయకులు చెప్తున్నారు. పార్టీని బతికించుకోవడానికి, రానున్న ఎన్నికల్లో మళ్ళీ టీడీపీకి అధికారం కట్టబెట్టడానికి తన వంతుగా నారా లోకేష్ చాలా కష్టపడుతున్నారు. గతంలో ఉన్న లోకేష్ కు, ఇప్పుడున్న లోకేష్ కు అస్సలు పోలిక లేదని సొంత టీడీపీ నేతలు చెప్తున్నారు.
పరుగులు పెడుతున్న లోకేష్
కరోనా ప్రభావంతో గత కొంత కాలంగా ఇంటికే పరిమితమైన లోకేష్, ఇప్పుడు వరద బాధితులను కలుస్తూ, వరద నీటిలో మునిగిపోయిన పంటల్ని పరిశీలిస్తూ, రైతుల సాధక బాధలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన వరుసగా రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బయటకు రావడానికి భయపడుతున్న తరుణంలో లోకేష్ టీడీపీ కార్యకర్తలను, నాయకులను. పరుగులు పెట్టిస్తున్నారు. వైసీపీ నాయకులు కూడా కరోనా వల్ల బయటకు రాకపోవడం వల్ల ఇప్పుడు ప్రజల్లో లోకేష్ పై అభిమానం పెరిగిందని టీడీపీ నాయకులు చెప్తున్నారు. గతంలో లోకేష్ నెమ్మదిగా ఉండేవారని కానీ ఇప్పుడు అలా లేరని, అధికార పక్షంపై కూడా చాలా బలంగా విమర్శలు చేస్తున్నారని పొగడ్తలతో ముంచేస్తున్నారు.
పార్టీ ప్రెసిడెంట్ ను పక్కన పెట్టిన లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పుడు ఎక్కువగా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఆయన ఎక్కువగా ప్రజల్లో ఉండడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. ఎంతలా ఆసక్తి చూపిస్తున్నారంటే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడును పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్లేంత ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా పార్టీ ప్రెసిడెంట్ ను పక్కన పెట్టడంతో అచ్చెన్నాయుడు అభిమానులు కోపంగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కనీసం అచ్చెన్నకు లోకేష్ సమాచారం కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. అయితే ప్రెసిడెంట్ అనుమతితోనే లోకేష్ ఇవ్వన్ని చేస్తున్నారని, త్వరలో ఇద్దరు ఒకే వేదికపై కనిపిస్తారని టీడీపీ నాయకులు చెప్తున్నారు.