తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ గతంలో మద్దతిచ్చింది. 2014 ఎన్నికల నాటి విషయమది. అయితే, ఆ తర్వాత టీడీపీ నుంచి ఎంత దూరంగా జరుగుదామనుకుంటున్నా అది సాధ్యపడటంలేదు జనసేన పార్టీకి. టీడీపీ రాజకీయాలు ఆ స్థాయిలో జనసేనను దెబ్బతీస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియాతోపాటు, వైసీపీ అనుకూల మీడియా కూడా జనసేనను దెబ్బతీయడానికి ఇదే అంశాన్ని ఉపయోగిస్తుండడం గమనించాల్సిన విషయం. అయితే, కింది స్థాయిలో కొందరు జనసేన నేతలు, కార్యకర్తల కారణంగా టీడీపీ, వైసీపీ పని సులువవుతోంది. పంచాయితీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం చూపగలిగినా, మునిసిపల్ ఎన్నికలకొచ్చేసరికి జనసేన తేలిపోతోన్న సంగతి తెలిసిందే.
ఇక, ఎన్నికల ప్రచారంలో ఇటు టీడీపీ శ్రేణులు అటు వైసీపీ శ్రేణులు..జనసేనను బాగా వాడేస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలోని కొన్ని మునిసిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థులు జనసేన జెండాలతోపాటుగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోల్ని వాడేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. స్థానిక ఎన్నికల్లో ఇలాంటి ‘సిత్రాలు’ మామూలే అయినా, గతంతో పోల్చితే ఇప్పుడు ఈ ‘సిత్రాలు’ ఇంకా ఎక్కువైపోయి, జనసేనను చిక్కుల్లో పడేస్తోంది. అయితే, ఎక్కడా జనసేన పార్టీ.. ఇతర పార్టీల జెండాల్నిగానీ, ఆయా నాయకుల్నిగానీ వాడుతున్నట్లు కనిపించడంలేదు. మిత్రపక్షం బీజేపీ జెండాలు కూడా జనసేనకు కలిసిరాకపోవడం మరో ఆసక్తికర అంశం. కొన్ని చోట్ల బీజేపీ, తెలుగుదేశం పార్టీకీ.. వైసీపీకీ సహకరిస్తుండడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, ఇంత జరుగుతున్నా టీడీపీపైనగానీ, వైసీపీపైనగానీ, బీజేపీపైనగానీ జనసేన అసహనం వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యకరమైన అంశం. ‘మా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఇతర సినిమాల్లో వాడేయడం చూశాం.. రాజకీయాల్లోనూ వాడేస్తుండడం చూస్తున్నాం..’ అని పవన్ కళ్యాణ్ సినీ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లేసుకుని మురిసిపోతున్నారు.