వైసీపీలో జరుగుతున్న ఆదిపత్య పోరు అంతా ఇంతా కాదు. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడం లేదు. నియోజకవర్గాల మీద పట్టు కోసం నేతలు ఒకరిని ఇంకొకరు డామినేట్ చేసుకుంటున్నారు. ఎక్కడైతే పోటీ ఉందో అక్కడ క్యాడర్ ముక్కలుగా విడిపోతోంది. ఒక్కో లీడర్ ఒక్కో వర్గాన్ని మైంటైన్ చేస్తూ హైకమాండ్ ను హడలెత్తిస్తున్నారు. వీళ్లు చాలరన్నట్టు టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన నేతలు సపరేట్ వర్గాన్ని కూడగట్టుకుంటున్నారు. దీంతో మూడు వర్గాలు తయారయ్యాయి. ఎవరికి వారు ఆదిపత్యం కోసం విడివిడిగా పనిచేసుకుంటున్నారు. అలాంటి నియోజకవర్గాల జాబితాలో ప్రకాశం జిల్లా దర్శి కూడ చేరింది. ఇక్కడ వైసీపీలో మొత్తం మూడు గ్రూపులున్నాయి.
ఒకటి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వర్గం కాగా రెండవది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గ్రూప్. మూడవది సిద్దా రాఘవరావు వర్గం. నిజానికి గత ఎన్నికల్లో జగన్ టికెట్టును శివప్రసాద్ రెడ్డికే ఆఫర్ చేశారు. కానీ 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడటంతో ఆర్థికంగా బాగా దెబ్బతిన్న బూచేపల్లి తాను పోటీ చేయలేనని అన్నారు. దీంతో టికెట్ మద్దిశెట్టి వేణుగోపాల్ దక్కించుకుని ఎన్నికల్లో గెలిచారు. ఆతర్వాత బూచేపల్లి, మద్దిశెట్టి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. తాను ఎమ్మెల్యేనని మద్దిశెట్టి అంటే తాను సీనియర్ అని బూచేపల్లి అంటున్నారు. ఇలా రెండు వర్గాలు తయారవ్వగా తాజాగా టీడీపీ నుండి పార్టీలోకి వచ్చిన శిద్దా రాఘవరావు కూడ మెల్లగా ప్రతాపం చూపడం స్టార్ట్ చేశారు.
గతంలో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ఉండటంతో మంచి అనుచరగణాన్ని కలిగి ఉన్నారు. ఆయన కూడ వైసీపీలో ఒక వర్గాన్ని కూడగట్టుకుంటున్నారు. ఈ కూడగట్టే ప్రయత్నమే తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా పరిణమించింది. శిద్దా రాఘవరావు టీడీపీ శ్రేణులను సైతం తన వర్గంలో కలిపేసుకుంటున్నారట. మద్దిశెట్టి, బూచేపల్లి వర్గాలను తట్టుకుని నిలబడాలంటే భారీ క్యాడర్ ఉండాలి. అందుకే శిద్దా రాఘవరావు టీడీపీ శ్రేణులను అట్రాక్ట్ చేస్తున్నారు. టీడీపీ మాత్రం దూరమవుతున్న శ్రేణులను కాపాడుకోలేకపోతోంది. ఎందుకంటే అక్కడ పార్టీకి మంచి లీడర్ లేకపోవడమే. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన కదిరి బాబురావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అందుకే పార్టీ శ్రేణులు శిద్దా రాఘవరావు వెంట వెళుతున్నాయి. వారిని కాపాడుకోవాలి అంటే పార్టీకి అక్కడ ఒక మంచి లీడర్ కావాలి. కానీ తెలుగుదేశానికి అలాంటి లీడర్ ఎవరూ కనిపించట్లేదు. అదే వారిలో గుబులు పుట్టిస్తోంది. ఇలాగే వదిలేస్తే దర్శిలో పార్టీయే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇలా వైసీపీలో పుట్టిన ఆదిపత్య పోరు టీడీపీలో కలకలం సృష్టిస్తోంది.