తెలంగాణలో జెండా పీకేసిన తెలుగుదేశం పార్టీ

TDP Chapter Closed in Telangana

తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం, అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనమైపోయినట్టే. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందించారు. నిజానికి, ఇది రెండో సారి.. ఇలా టీడీపీ శాసనసభా పక్షం తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనమవడం. గతంలో.. అంటే, 2014 ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి కథే నడిచింది. అప్పట్లో టీడీపీ తరఫున చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి గెలిచినా, టీడీపీ తరఫున గట్టిగా నిలబడలేక, తెలంగాణ రాష్ట్ర సమితిలోకి జంప్ చేసేశారు. 2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు తెలంగాణలో గెలిచారు. ఆ ఇద్దరిలో ఒకరు సండ్ర వెంకట వీరయ్య కాగా, ఇంకొకరు మెచ్చా నాగేశ్వరరావు. వీరిలో సండ్ర వెంకట వీరయ్య, ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సండ్ర గతంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి తలుపు తట్టేశారు.

తాజాగా మెచ్చా నాగేశ్వరరావు కూడా కారెక్కేశారు. ఈ క్రమంలోనే టీడీఎల్పీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసెయ్యాలని ప్రతిపాదించారు సండ్ర, మెచ్చా. సో, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా జెండా పీకేసినట్టే. గ్రేటర్ ఎన్నికల్లోనూ ఉనికిని చాటుకోలేకపోయిన టీడీపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చేతులెత్తేసింది. తెలంగాణలో పరిస్థితి ఇలా వుంటే, ఏపీలోనూ టీడీపీ పరిస్థితి ఏమీ బాగా లేదు. తెలంగాణలో టీడీపీని బతికించుకోవడం కోసం ఏపీలో పార్టీని పణంగా పెట్టిన చంద్రబాబు, అక్కడా దెబ్బతినేశారు. మొత్తానికి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది టీడీపీ. ఇటీవలే టీడీపీ 40 ఏళ్ళు పూర్తి చేసుకోగా, ఆ తర్వాతి నుంచి వరుస దెబ్బలు తగులుతున్నాయి ఆ పార్టీకి. దాదాపుగా జెండా పీకేసే స్థితిలో వున్న టీడీపీ, పూర్తిగా జెండా పీకెయ్యడానికి పెద్దగా సమయం తీసుకోకపోవచ్చేమో.