టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిట్యుయేషన్ దారుణంగానే ఉంది. కలిసి వచ్చే వాళ్ళ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఆయన. మొదటి నుండి పొత్తుల ఆనవాయితీని కొనసాగిస్తున్న ఆయన 2014లో ఆ పొత్తులతోనే అధికారంలోకి వచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో ఎవ్వరూ తోడు లేకపోవడం, పాలన మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో దారుణమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. దీంతో ఈసారి ఎన్నికలకు ఎలా వెళ్లాలనే భయం పట్టుకుంది ఆయనకు. అందుకే ఇంకా ఎన్నికలకు నాలుగేల్ల సమయం ఉండగానే మిత్ర పక్షాలకు ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారు.
ఎవ్వరూ నమ్మట్లేదు:
ప్రజెంట్ ఆయన కోరుకుంటున్నది బీజేపీ స్నేహం. రాష్ట్రంలో అంత బలం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆపదలో ఆదుకుంటారనే ఆశ ఉంది బాబుగారికి. పైగా బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. బీజేపీని గనుక ఒప్పిస్తే జనసేన మద్దతు కూడ కలిసివస్తుంది. పైగా కొత్త అధ్యక్షుడు వచ్చాక బీజేపీ బాగా యాక్టివ్ అయింది. ఎన్నికల నాటికి వారి బలం పెరిగే అవకాశం లేకపోలేదు. అందుకే వారి పొత్తును కొరుకుంటోంది టీడీపీ. కానీ చంద్రబాబుతో చేతులు కలిపే సాహసం బీజేపీ, జనసేనలు చేయలేకున్నాయి. కారణం 2014 ఎన్నికల తర్వాత ఆయన విపరీత వైఖరే.
ఎన్టీఆర్ ను బ్రతిమాలుకుంటే:
బాబు ఎంత ప్రయత్నించినా బీజేపీ, జనసేనలు టెంప్ట్ కావట్లేదు. అయినా బీజేపీని గిల్లడం బాబు ఆపట్లేదు. పరోక్షంగా బ్రతిమాలుకుంటున్నారు. ఈ వ్యవహారం చూస్తున్న తెలుగు తమ్ముళ్లు అయ్యో ఎందుకింత ఖర్మ.. సొంత మనిషి జూనియర్ ఎన్టీఆర్ ఉండగా అంటున్నారు. వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లు పట్టుకునే బదులు స్వయంగా వెళ్ళి తారక్ ను ఒక్క మాట అడిగి సపోర్ట్ ఇమ్మంటే ఇవ్వడా అంటున్నారు. నిజమే.. ఎన్టీఆర్ బాబుగారి మీద గుర్రుగా ఉన్నారు. మామూలుగా అయితే మద్దతు పలకడానికి ఒప్పుకోరు. కానీ తాతగారు పెట్టిన పార్టీ కష్టాల్లో ఉందని, సహకారం అందించాల్సిన సమయం ఆసన్నమైందని, పరిస్థితులు, మనుషులు మారాయని చెబితే ఒప్పుకోరా. బాలకృష్ణ మాట సహాయం తీసుకుంటే తారక్ ఒప్పుకోకుండా ఉంటారా అంటున్నారు.
బీజేపీ, జనసేనల సపోర్ట్ తీసుకుంటే టీడీపీ తలరాత ఒక్కసారిగా మారిపోదు. ఏదో పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి అంతే. ఆ సహాయం ఏదో ఎన్టీఆర్ వలన కూడ సాధ్యమవుతుంది. ఆయనే ఒప్పుకుంటే పార్టీకి కొత్త ఉత్సాహం, ఊపు వస్తుంది. క్యాడర్ సైతం పుంజుకుంటుంది. అది పార్టీని సంక్షోభం నుండి బయటకు తీసుకురాగలదు అంటూ విశ్లేషణ చెబుతున్నారు. వారి మాటల్లోనూ నిజం లేకపోలేదు. ఎవరెవరినో బ్రతిమాలుకునే బదులు వారసుడినే ఒప్పించుకోవడమే ఉత్తమం.