విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమంటోంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్. పరిస్థితులు అక్కడిదాకా వస్తే, రాష్ట్ర ప్రభుత్వమే విశాఖ ఉక్కు పరిశ్రమను తీసుకునేలా కార్యాచరణ రూపొందిస్తామని అధికార పార్టీకి చెందిన నేలు పలు సందర్భాల్లో చెప్పిన విషయం విదితమే. కాగా, విశాఖ ఉక్కు విషయమై ఆసక్తిగా వున్నట్లు టాటా స్టీల్ సంస్థ ప్రకటించింది. సముద్ర తీరాన వున్న అతి పెద్ద ఉక్కు పరిశ్రమ కావడం, ఎగుమతులు అలాగే దిగుమతులకు అనుకూలంగా వుండడం సహా అనేక అనుకూలతల నేపథ్యంలో విశాఖ ఉక్కుని సొంతం చేసుకునేందుకు తామూ పోటీ పడతామని టాటా సంస్థ ప్రకటించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగనీయబోమని గతంలో ప్రకటించిన ఏపీ బీజేపీ, ఇప్పుడు మాత్రం ప్లేటు ఫిరాయించింది. దేశాన్ని ఉద్ధరించేస్తున్నామని చెప్పుకుంటూ బీజేపీ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేశంలోని కీలకమైన సంస్థల్ని అమ్మేస్తోన్న వైనంపై తీవ్రస్థాయి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘వీలైతే అమ్మేస్తాం, వీలు కాకపోతే మూసేస్తాం..’ అంటూ నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు కేంద్ర మంత్రులు. విశాఖ ఉక్కు పరిశ్రమ. దేశ సంపద. అంటే, అది దేశ ప్రజల సంపద. అలాంటప్పుడు, మోడీ ప్రభుత్వం ఆ పరిశ్రమను ఎలా విక్రయించేయగలుగుతుంది.? అధికారం చేతిలో వుంటే, ఏమైనా చేయొచ్చన్నది మోడీ సర్కార్ చేసి చూపిస్తోంది. ఇక, రాష్ట్ర ప్రభుత్వం విషయానికొస్తే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలేమీ బాగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమను రాష్ట్రం సొంతం చేసుకోగలదా.? ఆయా పథకాలకు సంబంధించి కేంద్రం సాయం కోసం ఏపీ ప్రభుత్వం ఎదురు చూస్తోన్న విషయం విదితమే. ఏదిఏమైనా, విశాఖ ఉక్కు పరిశ్రమ, అమ్ముడైపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గనుక ముఖ్యమంత్రి హోదాలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగలిగితే, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం అయిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగకుండా వుంటుంది.