వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్‌పై ‘తమిళ’ సబ్సిడీ.!

Cooking Gas, Petrol,

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల అంశం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కొద్ది రోజులపాటు పెట్రో ధరలు పెరగకుండా ఆగిపోయిన సంగతి తెల్సిందే. ఎన్నికల ఫలితాలు రాగానే, ఒక్కసారి బాదుడు షురూ అయ్యింది. ఇక, నాలుగు రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పులు పెద్దగా కన్పించడంలేదు. అంతా రాజకీయ మాయ.. అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఇక, తమిళనాడులో అధికారం తమదేనంటోన్న ప్రస్తుత ప్రతిపక్షం డీఎంకే, ఎన్నికల మేనిఫెస్టోలో ఆసక్తకరమైన అంశాల్ని పొందుపరిచింది.

వంట గ్యాస్ సిలెండర్ మీద 100 రూపాయల సబ్సిడీ, పెట్రోలు మీద 5 రూపాయలు, డీజిల్ మీద 4 రూపాయలు సబ్జిడీ ఇస్తామని ప్రకటించింది డీఎంకే. ఇది నిజంగానే చిత్రమైన ఎన్నికల హామీ. ఎందుకంటే, కేంద్రం ధరలు పెంచుకుంటూ పోతున్నప్పుడు రాష్ట్రాలూ ఆ స్థాయిలోనే వసూలు చేయక తప్పదు. రాష్ట్రాల పరంగా కొన్ని పన్నులు పెట్రోధరల్లో కలిసే వుంటున్నా.. వాటిని తగ్గించుకుంటే, రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుంది. పైగా, 100 రూపాయలు వంట గ్యాస్ మీద తగ్గింపు అంటే చిన్న విషయం కాదు. పెట్రోలు, డీజిల్ విషయంలో కూడా అంతే. మరి, అధికార అన్నాడీఎంకే ఏం చేస్తుంది.? ఆ పార్టీకి మిత్రపక్షమైన బీజేపీ ఏం చెబుతుంది.? నిజానికి, దేశంలో ‘పెట్రో దోపిడీ’ అత్యంత దారుణంగా తయారవుతోంది. ‘రాష్ట్రాలు కూడా డబ్బులు బాగానే సంపాదిస్తున్నాయ్..’ అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చాలా ‘తేలికైన ప్రకటన’ పెట్రో ధరల గురించి వేయడం.. బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. కాగా, తమిళనాడు బాటలోనే దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న మిగతా రాష్ట్రాలూ తమ తమ మేనిఫెస్టోల్లో వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల అంశాన్ని ప్రస్తావించేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles