చలికాలంలో గ్యాస్ బిల్ డబుల్ అవుతుందా.. సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే..!

ఇంట్లో వంట అనేది తప్పనిసరి అవసరం. కానీ అదే సమయంలో గ్యాస్ సిలిండర్ ఖర్చు ఎక్కువగా అయ్యే ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటిగా మారుతోంది. ముఖ్యంగా చలికాలంలో నీటిని వేడి చేయడం, ఎక్కువసేపు స్టౌవ్‌పై వంట చేయడం వల్ల గ్యాస్ వినియోగం అనుకోకుండా పెరిగిపోతుంది. అయితే వంట చేసే విధానంలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే గ్యాస్‌ను ఆదా చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

చాలామంది చేసే సాధారణ పొరపాటు పాత్రకు సరిపోని బర్నర్‌ను ఉపయోగించడమే. చిన్న పాత్రను పెద్ద బర్నర్‌పై పెట్టినప్పుడు మంట బయటకు వృథాగా పోతుంది. అలాగే పెద్ద పాత్రను చిన్న బర్నర్‌పై ఉంచితే వంట ఎక్కువ సమయం పడుతుంది. పాత్ర అడుగంతా మంట సమానంగా తాకేలా బర్నర్‌ను ఎంపిక చేసుకుంటే ఆహారం త్వరగా ఉడుకుతుంది, గ్యాస్ కూడా తక్కువగా ఖర్చవుతుంది.

వంట మొదలుపెట్టే ముందు సరైన ప్లానింగ్ ఉండటం కూడా గ్యాస్ పొదుపుకు కీలకం. ఒక్కో వంటను విడిగా చేయడం కంటే, ఒకేసారి ఎక్కువ వంటలను సిద్ధం చేసుకోవడం మంచిది. ఉదాహరణకు పప్పు, కూర, కర్రీలను ఒకే సమయంలో వండి ఉంచితే, తర్వాతి భోజనాలకు కేవలం వేడి చేయడం సరిపోతుంది. ఇలా చేస్తే స్టౌవ్‌ను మళ్లీ మళ్లీ వెలిగించాల్సిన అవసరం తగ్గుతుంది.

గ్యాస్ బర్నర్ శుభ్రతను చాలా మంది పట్టించుకోరు. కానీ బర్నర్‌లో నూనె, మురికి పేరుకుపోతే మంట సరిగా రావదు. ఫలితంగా వంట ఆలస్యం అవుతుంది, గ్యాస్ వినియోగం పెరుగుతుంది. వారానికి కనీసం ఒక్కసారైనా బర్నర్‌ను శుభ్రం చేస్తే మంట స్పష్టంగా వస్తుంది, వంట వేగంగా పూర్తవుతుంది. గ్యాస్ ఆదా చేయడంలో ప్రెషర్ కుక్కర్ అత్యంత ఉపయోగకరమైన సాధనం. ఆవిరి, ఒత్తిడి కారణంగా ఆహారం తక్కువ సమయంలోనే ఉడుకుతుంది. అన్నం, పప్పు, కూరలు, సూప్‌లు వంటి వాటిని ఓపెన్ పాత్రల్లో వండే కంటే కుక్కర్‌లో వండితే గ్యాస్ వినియోగం సగం వరకు తగ్గుతుందని అంచనా.

వంట చేసే సమయంలో పాత్రపై మూత పెట్టడం, కూరగాయలను చిన్న ముక్కలుగా కట్ చేయడం వంటి చిన్న అలవాట్లు కూడా పెద్ద తేడా చూపిస్తాయి. అలాగే చలికాలంలో నీరు, పాలు అవసరమైనంత మాత్రమే వేడి చేయాలి. అవసరం లేకుండా స్టౌవ్‌పై ఎక్కువసేపు ఉంచడం గ్యాస్ వృథా చేస్తుంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే గ్యాస్ బిల్ తగ్గడమే కాదు, ఒక సిలిండర్‌ను మరింత ఎక్కువకాలం ఉపయోగించుకోవచ్చు.