లాక్ డౌన్ అనంతర తెలుగు పరిశ్రమ చూపిస్తున్న దూకుడు అంతా ఇంతా కాదు. వారానికి అరడజనుకు పైగా సినిమాల్ని రిలీజ్ చేస్తూ దుమ్ము లేపుతోంది. చిన్న బడ్జెట్ సినిమాలే అయినా థియేటర్ల నిండుగా సినిమాలు ఉంటున్నాయి. మధ్య మధ్యలో ‘క్రాక్, ఉప్పెన. నాంది’ లాంటి హిట్ సినిమాలు పడుతూనే ఉన్నాయి. యావరేజ్ సినిమాలు కూడ బాగానే పడుతున్నాయి. చాలా వరకు సినిమాలు పూర్తిస్థాయిలో కాకపోయినా భారీ నష్టాల్లో లేకూండా ఎంతో కొంత వెనక్కు రాబట్టుకోగలుగుతున్నాయి. ఈ వారం అయితే మూడు మంచి సినిమాలున్నాయి. మూడూ హిట్టయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగష్టు వరకు పెద్ద సినిమా చాలా ఉన్నాయి.
మొత్తానికి దేశంలో ఏ భాషలోనూ లేని విధంగా టాలీవుడ్ కోలుకుంది. కానీ పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీ ఇంకా కష్టాల్లోనే ఉంది. ఒక్క ‘మాస్టర్’ మినహా ఈమధ్య కాలంలో చెప్పుకోదగిన సినిమాలేవీ రాలేదు. చిన్న సినిమాలు వచ్చినా కూడ 10 నుండి 20 శాతం వరకు కూడ రికవరీ చేయలేకపోయాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చిన చిన్నా చితకా సినిమాలన్నీ డిజాస్టర్లే. ప్రతిదీ నష్టాల్లో వెనుదిరిగినవే. దీంతో ప్రేక్షకులు సైతం నిరాశకు గురవుతున్నారు. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే స్టార్ హీరోల సినిమాలు పడాల్సిందే అంటున్నారు తమిళ సినీ పెద్దలు.