ఒకప్పుడు దక్షిణాదిలో టాప్ ఇండస్ట్రీ ఏది అంటే తమిళ ఇండస్ట్రీ పేరే గట్టిగా వినబడేది. ముఖ్యంగా అక్కడే హీరోయిన్లు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. ఒకప్పుడు నయనతార, త్రిష లాంటి స్టార్ కథానాయికలు, మీడియం రేంజ్ హీరోయిన్లు మెండుగా దొరికేవారు. తెలుగు స్టార్ హీరోలకు పెద్ద కథానాయికలు కావాలంటే అక్కడి నుండే దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత పెద్ద మొత్తం డిమాండ్ చేస్తే అంత పెద్ద మొత్తం ఇచ్చి తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తమిళ హీరోలకు హీరోయిన్లే కరువయ్యారు. కొత్త అమ్మాయిలు తగ్గిపోయారు.
ఫ్రెష్ పెయిర్స్ కుదరడంలేదు. గట్టిగా చూస్తే ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది లేరు కొత్త హీరోయిన్లు. అందుకే తెలుగు మీద పడ్డారు. ఈమధ్య కాలంలో తెలుగులో కొత్త హీరోయిన్లు చాలామందే తయారయ్యారు. పూజా హెగ్డే, రష్మిక మందన్న, నిధి అగర్వాల్, కృతి శెట్టి, కేతిక శర్మ, అను ఇమ్మాన్యుయేల్, రీతూ వర్మ లాంటి కొత్త అమ్మాయిలు తయారయ్యారు. వీళ్ల కోసం తమిళ తంబీలు క్యూ కడుతున్నారు. పెద్ద హీరోల సరసనే ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. విజయ్ కొత్త సినిమాలో పూజా, రష్మిక హీరోయిన్లుగా కుదరగా, కార్తీ కొత్త సినిమాలో రష్మికనే హీరోయిన్. అలా తమిళంలో ఏర్పడిన కొరత టాలీవుడ్ హీరోయిన్లకు అలా కలిసొచ్చింది.