మాజీ సీఎస్ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజీపీ ఎంపీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావుల పార్క్ హయత్ సీక్రెట్ భేటీపై సోషల్ మీడియాలో పొలిటికల్ కథనాలు హీటెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు వైకాపా నేతలు, ఫాలోవర్స్ దీన్ని పూర్తిగా రాజకీయ భేటిగానే వర్ణించి ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా నిమ్మగడ్డను మళ్లీ పాత పదవిలో కూర్చోబెట్టడానికి జరిగిన భేటీ అంటూనే నానా యాగీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితమే సుజాన చౌదరి ఈ ప్రచారంపై నోరు విప్పారు. దానికి సంబంధించి ఓ లేఖ కూడా విడుదల చేసారు. తనదైన శైలిలో స్పందించి ఈ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టారు.
ఈనెల 13న ముగ్గురు కలిసి మాట వాస్తవం. కానీ ఎందుకు కలిసామన్నది మాకు మాత్రమే తెలుసునని అసహనం వ్యక్తం చేసారు. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయండి అన్న చందంగా పలువురు వైకాపా నేతలు ప్రచారం చేసారని మండిపడ్డారు. లాక్ డౌన్ తర్వాత తన వ్యాపారాలకు సంబంధించి అన్ని కార్యకలాపాలను పార్క్ హయత్ నుంచే మొదలు పెట్టానన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలను, రాజకీయ నిపుణులను రెగ్యులర్ గా కలుస్తున్నానన్నారు. అదే సమయంలో నిమ్మగడ్డ, కామినేని కూడా తారసపడ్డారన్నారు. అవి ఎంత మాత్రం రహస్య సమావేశాలు కాదని, రాజకీయ భేటీలు అంతకన్నా కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
13వ తేదీన ముందుగా కామినేని కలవలంటే అపాయింట్ మెంట్ ఇచ్చానన్నారు. అదే రోజు నిమ్మగడ్డ కూడా కలవలన్నారు. దీంతో ఇద్దరితో వేర్వేరుగానే మాట్లాడాను. ముగ్గురు కలిసి మాట్లాడింది లేదన్నారు. కామినేనితో ఏపీ బీజేపీ వ్యవహారాలు, అతను వెళ్లాక నిమ్మగడ్డతో ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకున్నామన్నారు. నిమ్మగడ్డ ఎప్పటి నుంచో తమ కుటుంబానికి మంచి మిత్రులన్నారు. ఆయనతో ఎలాంటి రాజకీయ విషయాలు గానీ, ఆయన విధి నిర్వహణకు సంబంధించిన అంశాలుగానీ డిస్కస్ చేయలేదని సుజనా చౌదరి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.