వైసీపీ నేత, నిర్మాత పీవీపీ దూకుడు చర్య గురించి తెలిసిందే. బంజారాహిల్స్ లో తన ఇంటి పక్క విస్తరణ పనులు చేపడుతోన్న కైలాష్ అనే వ్యక్తి ని రౌడీలతో బెదిరించడం..అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై కుక్కల్ని వదలడం వంటి చర్యలతో పీవీపీ పేరు మారు మ్రోగిపోయింది. సినీ నిర్మాత అయి ఉండి, వైకాపాలో కీలక నేతగా పేరుగాంచిన పీవీపీ ఇలా చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక కేసుగా తీసుకుని మరోసారి అరెస్ట్ కు రెడీ అవ్వడంతో పీవీపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టులో ఊరట లభించింది. కోర్టు అనుమతి లేనిదే పీవీపీని అరెస్ట్ చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో పీవీపీకి భారీ ఊరట దొరికినట్లు అయింది. అయితే కోర్టు తీర్పుతో పనిలేకుండా పీవీపీని పోలీసులు గట్టిగానే టార్గెట్ చేసినట్లు తాజా సన్నివేశం చెబుతోంది. తెలుగు రాష్ర్టాల్లో పీవీపీ కోసం పోలీసులు శనివారం ఆకస్మిక తనిఖీలు మొదలు పెట్టారు. ఆయన ఇంటికెళ్లిన నేపథ్యంలో ఇంట్లో లేకపోవడంతో హైదరాబాద్ లో ఉన్న ఆయన ఆఫీసుకు వెళ్లారు. అక్కడా పీవీపీ కాన రాలేదు. దీంతో విజయవాడలో హోటళ్లు, పీవీపీ సన్నిహితులు ఇళ్లలో తనిఖీలు చేశారు. అక్కడ కూడా పీవీపీ లేరు. దీంతో పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు పోలీసు వర్గాల నుంచి తెలిసింది.
అయితే ఈ కేసు విషయంలో హైకోర్టు ముందొస్తుగా అరెస్ట్ చేయోద్దని ఉత్తర్వులు ఇచ్చినా ..పీవీపీ ని పోలీసులు ఎందుకు వెంటాడుతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ రెండు కేసులు కాకుండా పీవీపీపై మరో కొత్త కేసు ఏదైనా నమోదైందా? అందుకే పోలీసులు గాలిస్తున్నారా? ఈ కారణంగానే పీవీపీ పరారయ్యారా?అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ సహా, విజయవాడలోనూ పీవీపీ ఆఫీస్ లపై పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం.