ఒక్క రోజులోనే ఎంత తేడా.? అనవసరంగా న్యాయ వ్యవస్థపై నోరు పారేసుకున్నారు కొందరు వైఎస్సార్సీపీ అభిమానులు. నిన్న సీన్ అలాంటిది మరి. పదో తరగతి అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విషయమై ఆంధ్రపదేశ్ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టింది. పరీక్షల నిర్వహణ ద్వారా విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది.
పరీక్షలు నిర్వహించాలనే అనుకుంటే.. ఎవరన్నా విద్యార్థి కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతే కోటి పరిహారమివ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. దాంతో, ఏపీ సర్కార్ మొండి వైఖరి వీడింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది నిన్న రాత్రి. ఆ విషయాన్ని ఈ రోజు సుప్రీంకోర్టుకి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అభినందించింది. ఇలాంటి విషయాల్లో మానవీయ కోణంలో ఆలోచన చేయాల్సి వుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అలాంటి వ్యాఖ్యలు నిన్న చేయాల్సి వచ్చిందని కూడా పేర్కొంది. ఇంకేముంది.. సుప్రీంకోర్టు, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిందనే వార్తని వైసీపీ అభిమానులు పండగలా ప్రచారం చేసేసుకుంటున్నారు. అందుకే, కోర్టుల్ని తొందరపడి విమర్శించేయకూడదు.
అక్కడి వాదనల్ని బట్టి.. పరిస్థితులు ఆధారపడి వుంటాయి. బలమైన వాదనలు లేకపోతే.. కోర్టులు మాత్రం ఏం చేయగలుగుతాయి.? అంతిమంగా న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంటాయి. అంతే తప్ప, కోర్టు తీర్పులపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం ఎవరికీ తగదు. కోర్టులు ప్రభుత్వాల్ని ప్రశ్నించేది, నిలదీసేది.. ప్రజలకు మరింత మెరుగైన రీతిలో న్యాయం అందడానికే.