ఏపీ సర్కారుకు కోర్టుల్లో ఇక కలిసొస్తుందా?

YS Jagan gets favourable judgement from Supreme Court

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఇటీవలి కాలంలో అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఇక మంచి కాలం వచ్చినట్టు కనిపిస్తోంది. అమరావతి భూములకు సంబంధించిన కథనాల ప్రచురణపై హైకోర్టు విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తేసిన విషయం తెలిసిందే. ఇది చంద్రబాబు అండ్‌ కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బే.

చంద్రబాబు ప్రభుత్వంలో నిఘా అధిపతిగా వ్యవహరించిన ఐపీఎస్‌ అధికారి ఎ.బి.వేంకటేశ్వరరావు సస్పెన్షన్‌ వ్యవహారంలోనూ ఏపీ సర్కారుకు అనుకూలంగా సుప్రీంకోర్టు కోర్టు స్టే ఆదేశాలు ఇచ్చింది. దేశభద్రతకు సంబంధించిన కీలకమైన విషయాలను ఇజ్రాయేల్‌కు చెందిన రక్షణ ఆయుధ సంస్థకు వెల్లడించారనే ఆరోపణలపై ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఎ.బి.వేంకటేశ్వరరావును వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

ఈ ఆదేశాలను కొట్టేస్తూ, ఎ.బి.వేంకటేశ్వరరావును తిరిగి సర్వీసుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు సస్పెండ్‌ అయిన కాలానికి వేతనం కూడా చెల్లించాలని హుకుమిచ్చింది. ఈ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్‌ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. సస్పెన్షన్‌కు అనుకూలంగా వాదనలు వినిపించి హైకోర్టు ఆదేశాలపై స్టే తీసుకుంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఎ.బి.వేంకటేశ్వరరావును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు వారాల తర్వాత ఈ కేసు తిరిగి విచారణకు రానుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎ.బి.వేంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యూనల్‌ సమర్థించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ కూడా సస్పెన్షన్ ఉత్తర్వులను నిర్థారించింది. కాని, మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఈ సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొట్టేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.