మనదేశంలో ధనికులకే సత్వరన్యాయం లభిస్తుందని మాజీ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా చెప్పిన మాట ఆణిముత్యం. పేదవారు ఎంతటి ప్రాచుర్యం కలిగినవారైనా వారికి దశాబ్దాల తరువాత కూడా న్యాయం దొరకడం గగనకుసుమం. కానీ, కోట్లాధిపతులు కోర్టు తలుపు తట్టగానే వారికి తక్షణ న్యాయం లభిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద ఆర్ధిక ఉగ్రవాదిగా పేరుగాంచిన బీజేపీ ముసుగులోని తెలుగుదేశం నాయకుడు సుజనా చౌదరి అమెరికా వెళ్లాలని ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లారట. ఆయన బ్యాంకులకు ఆరువేలకోట్ల రూపాయల మేరకు సున్నం పెట్టారని గతంలో కేసులు ఉన్నాయి. లుక్ అవుట్ నోటీసులు కూడా ఉన్నాయట. ఆయన్ను విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారట. ఆయన వెంటనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారట..అదేదో అర్జంటుగా తేల్చకపోతే ప్రపంచయుద్ధం వస్తుందన్నంత హడావిడిగా అర్ధరాత్రి కూర్చుని ఆయన పిటీషన్ స్వీకరించి షరతుల మీద ఆయన అమెరికా వెళ్లిపోవచ్చని హైకోర్టు అనుమతి మంజూరు చేసిందట!
వింటే నవ్వు వస్తుంది కదూ! కోవిద్ నేపథ్యంలో సొంత కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అక్క చెల్లెల్లు మరణిస్తేనే వేరే ప్రాంతాలకు పోవడానికి వెనుకాడుతున్నారు. మొన్నమొన్నటిదాకా పక్క గ్రామానికి వెళ్లాలన్నా అనుమతులు లేవు. స్వదేశంలో తమ కుటుంబ సభ్యులు మరణించినప్పటికీ విదేశాల్లో నివసిస్తున్నవారికి వెళ్ళడానికి అనుమతులు ఇవ్వడం లేదు. అలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న బంధువును చూడడానికి ఆగమేఘాల మీద అనుమతి లభించందంటే దీన్ని ఎలా చూడాలి? పైగా సుజనా చౌదరి మీద తీవ్రమైన ఆర్ధిక నేరాల కేసులు ఉన్నాయి. పేదవాడైన విప్లవకవి వరవరరావు పూణే జైల్లో రెండేళ్లనుంచి మగ్గిపోతున్నా, మంచం మీదినుంచి లేవలేని పరిస్థితి ఉన్నా, ఆయనను హైదరాబాద్ వెళ్ళడానికి కోర్టులు అనుమతించడం లేదు.
అయితే ఇక్కడ సిబిఐ వ్యవహారశైలి మీద కూడా సందేహం కలుగుతున్నది. సిబిఐ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులకు జూన్ లోనే కాలం చెల్లిందని సుజనా చౌదరి తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారట. అయితే దాన్ని పునరుద్ధరించామని సిబిఐ చెబుతున్నది. ఈ రెండింటిలో ఏది నిజం? లుక్ అవుట్ నోటీసులు ఉన్న నిందితుడికి ఏ విధంగా కోర్ట్ విదేశాలకు చెక్కెయ్యడానికి అనుమతి ఇస్తుంది? అతను మళ్ళీ తిరిగి వస్తాడని గ్యారంటీ ఏముంది? ఇప్పటికే విజయ మాల్యా, నీరవ్ మోడీ లాంటి ఆర్ధిక నేరగాళ్లు విదేశాలు వెళ్లి అక్కడే దర్జాగా నివసిస్తున్నారు. వారిని తిరిగి ఇండియా రప్పించడానికి కేంద్రం తెగ ఆయాసపడిపోతున్నామని కేంద్ర ప్రభువులు భలేగా డ్రామాలు ఆడుతున్నారు. తెలుగుదేశం నుంచి బీజేపీలోకి జంప్ చేసిన సుజనా చౌదరి పట్ల కేంద్రం చూసీ చూడనట్లు పోతున్నదని, కచ్చితంగా కేంద్ర సహకారం లేనిదే ఇలాంటి ఊరటలు లభించవని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి ఉదంతాలను చూస్తుంటే న్యాయం అనేది వ్యక్తి యొక్క సామాజిక హోదా, ఆర్ధిక అంతస్తు, పలుకుబడి లాంటి అర్హతలమీద ఆధారపడి ఉందని ఈజీగా అర్ధం అవుతుంది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు