చంద్ర‌బాబు సైడైతే తేల్చుకుంటాన‌న్న సుబ్బారెడ్డి!

టీడీపీ నేత‌లు భూమా అఖిల ప్రియ‌-ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య వైరం ఇటీవ‌ల మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అఖిల ప్రియ త‌న‌ని చంపేందుకు కోటి రూపాయలు సుపారీ ఇచ్చింద‌ని తృటిలో ప్రాణా పాయం నుంచి త‌ప్పించుకున్న‌న‌ని ఏవీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. నాటి నుంచి వివాదం మ‌రింత ముదిరింది. ఇరువురు మీడియా సాక్షిగా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పించుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డిని చంపాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని అఖిల‌ప్రియ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. తాజాగా ఏవీ సుబ్బా రెడ్డి అఖిల ప్ర‌య‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అఖిల ప్రియ రాజ‌కీయం అంత‌మే త‌న పంతం అని శ‌బ‌ద్ధం చేసారు.

అఖిల ప్రియ ముఖం చూసినా ద‌రిద్ర‌మేన‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు త‌న‌కి-అఖిల ప్రియ‌కు మ‌ధ్య స‌యోధ్య కుదిర్చినా అఖిల ప్రియ‌ ఇంకా క‌క్ష‌తో ర‌గిలిపోతుంద‌ని, త‌న‌ని ఎందుకు చంపాల‌నుకుంటుందో ఇప్ప‌టికీ అర్ధం కాలేద‌న్నారు. చంద్ర‌బాబు వివాదాన్ని త‌మ‌ ఇద్ద‌రికి వ‌దిలేసి తేల్చుకోమంటే ఢీ కోట్ట‌డానికి రెడీగా ఉన్నానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. అఖిల ప్రియ ఎలాగూ హ‌త్యాప్ర‌య‌త్నం చేయించింది. ఇంత వ‌ర‌కూ తాను త‌గ్గే ఉన్నాన‌న్నారు. కానీ ఇంకెంతో కాలం ఓపిక ప‌ట్ట‌లేనంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. అఖిల ప్రియ ఏ పార్టీలో ఉన్నా ప‌ర్వాలేద‌ని..త‌న‌కు మాత్రం పార్టీల‌తో ప‌నిలేకుండా ముందుకెళ్తాన‌ని అన్నారు. ఆమె ఎదుగుద‌ల‌ను అడుగ‌డుగునా అడ్డుకుంటాన‌ని హెచ్చ‌రించారు.

దీంతో ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేప‌థ్యంలో ఏవీ పేరుకే టీడీపీలో ఉన్నార‌ని, ఆయ‌న వెనుక వైకాపా నాయ‌కుల హ‌స్తం ఉంద‌ని ఆరోప‌ణ‌లొస్తున్నాయి. అందుకే సుబ్బారెడ్డి అంత ధైర్యంగా స‌వాళ్లు విసురుతున్నార‌ని వినిపిస్తోంది. అఖిల‌ప్రియ వివాదం తొలి నాళ్ల‌లో చంద్ర‌బాబు నాయుడు క‌ల్పించుకున్న సంగ‌తి తెలిసిందే. కానీ త‌ర్వాత బాబు ఇద్ద‌రినీ ప‌ట్టించుకోవ‌డం మానేసారు. దీంతో అఖిల ప్రియ ఆ పార్టీకీ గుడ్ బై చెప్పే యోచ‌న‌లో ఉన్న‌ట్లు కొద్ది రోజులుగా ప్ర‌చారం సాగుతోంది.