Suside: వారిది అత్యంత పేద కుటుంబం. రోజు పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి. అయినప్పటికీ వీధిలో టిఫిన్ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తుంది ఓ తల్లి. ఇక తన కన్న కూతురిని కష్టపడి చదివిస్తోంది. ఈ క్రమంలోనే కూతురు పై చదువుల కోసం డబ్బు కావాలని తల్లి పై ఒత్తిడి తీసుకురావడంతో అందుకు తల్లి డబ్బు లేదని చెప్పడంతో ఎంతో మనస్తాపం చెందిన ఆ కూతురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని నూర్‌నగర్‌లో నివసించే కె.ధనలక్ష్మి రోడ్డు పక్కన టిఫిన్ అమ్ముతూ కాలం నెట్టుకొస్తోంది. ఈమె కూతురు దివ్య సత్య సాయి శ్రీ గత నెల రోజుల నుంచి తనకు ఉన్నత చదువులు చదవడం కోసం 60 వేల రూపాయలు అవసరమని తెలిపింది.అయితే ఇడ్లీలతో బతికే తన దగ్గర అంత డబ్బు లేదని తనకి అప్పు కూడా ఇచ్చే పరిస్థితిలో ఎవరూ లేరని తన కూతురికి అర్థమయ్యేలా వివరించింది.
తన తల్లి అలా చెప్పడంతో తన చదువు అక్కడితో ఆగిపోతుందని పై చదువులు చదవలేనని దీంతో మనస్తాపం చెందిన దివ్య మస్కిటో రిప్లెంట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో బాధితురాలిని మొదట చికిత్స నిమిత్తం విన్ ఆస్పత్రిలో చేర్చారు ఆమె పరిస్థితి ఏమాత్రం మెరుగుపడక పోవడంతో తిరిగి తనని ఈ నెల 7వ తేదీన పంజగుట్ట నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.