సీఎం జగన్ తన క్యాబినెట్ లో దాదాపు అరడజను మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాడు. అందులో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఒకరు. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రితో పాటుగా ఆమెకు అదనంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడు, ఇప్పుడు అదే పదవి ఆమెకు ఇబ్బందిగా మారటమే కాకుండా సొంత నియోజకవర్గ ప్రజలకు దూరం చేస్తుందని ఆమె వాపోతుంది.
విజయనగరం జిల్లాలో గిరిజనలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కురుపాం, అక్కడి నుండి 2014 లో వైసీపీ తరుపున గెలిచిన ఆమె అక్కడి గిరిపుత్రుల కోసం బాగా కష్టపడింది. టీడీపీ అధికారంలో ఉన్నకాని అక్కడి ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ, నిత్యం కొండల చుటూ, గిరిజన తండాల చుట్టూ తిరుగుతూ అక్కడ ప్రజలతో మమేకం అవుతూ మంచి పేరు తెచ్చుకుంది, ఇక 2019 లో గెలిచిన ఆమెకు సీఎం జగన్ గిరిజన మంత్రి పదవితో పాటుగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చాడు.
కేవలం ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే ఎంతో సేవ చేసిన తమ నాయకురాలు ఇప్పుడు మంత్రి కావటంతో తమకు మంచి రోజులు వచ్చాయని అక్కడి స్థానికులు భావించారు. అయితే అందుకు బిన్నంగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఎన్నో కార్యకమాలు చేస్తూ, ఎప్పుడు తమకు అందుబాటులో ఉండే పుష్పశ్రీవాణి ఇప్పుడు కనీసం ఆమె జాడ కూడా కనిపించటం లేదని, సరిగ్గా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగటం లేదని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై మంత్రి పుషశ్రీవాణి కూడా బాధతోనే ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కేవలం ఎమ్మెల్యే కాబట్టి కురుపాం కోసం ఎక్కువగా పనిచేశానని, ఇప్పుడు మంత్రి కావటంతో బాధ్యతలు పెరిగాయని, అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఉండటంతో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే పైనున్న నేతల ఒత్తిడి వలన తగిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. చేతిలో పదవి ఉంటే ఎలాంటి పనులైనా చేసుకోవచ్చని అందరు అనుకుంటుంటే, ఆ పదవి వలనే నియోజకవర్గానికి దూరమయ్యానని పుష్ప శ్రీవాణి బాధపడటం విడ్డురమే