రఘురామ అత్యుత్సాహం.. అనర్హత వేటు పడితే పరిస్థితేంటో.?

Raghurama
Raghurama
 
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, సొంత పార్టీ మీదనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొనడమే తప్పంటున్నారాయన. తమది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నారు.
 
ఈ క్రమంలో పెద్ద యాగీ జరిగింది. ప్రభుత్వం మీద బురద చల్లడం, ముఖ్యమంత్రి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వెరసి, మీడియాలో స్పేస్ దక్కించుకున్నా, ఆ వివాదాల కారణంగా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపో మాపో రఘురామ ఎంపీ పదవి ఊడితే ఏంటి పరిస్థితి.? అస్సలు ఆ ఛాన్సే లేదన్నది రఘురామ ధీమా.
 
కానీ, ఆయన మీద అనర్హత వేటు వేయించి తీరతామన్నది అధికార పార్టీ శపథం. రాజకీయాల్లో ఇలాగే జరుగుతుందనీ, ఇలాగే జరగాలనీ రూల్ ఏమీ వుండదు. ఆ విషయం రఘురామకీ బాగా తెలుసు. రాజద్రోహం కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాలు, రఘురామకి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. దాంతో ఆయన తెగ అత్యుత్సాహం చూపుతున్నారు.
 
ఇంకోపక్క, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోసం రఘురామ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సరే, వైఎస్ జగన్ బెయిల్ వ్యవహారమేమవుతుందన్నది వేరే చర్చ.
 
ఢిల్లీ స్థాయిలో వైసీపీ కాస్త గట్టిగా లాబీయింగ్ చేయగలిగితే, రఘురామ పదవి ఊడిపోవడం ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పార్లమెంటు సమావేశాలు జరగనున్న దరిమిలా, రఘురామ వ్యవహారాన్ని వైసీపీ చాలా సీరియస్‌గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.
 
ఒకవేళ వైసీపీ ఆశించిందే జరిగి, రఘురామ పదవి ఊడిపోతే.. ఆ తర్వాత రఘురామ పరిస్థితేంటి.? టీడీపీ పట్టించుకోదు.. బీజేపీ కూడా లెక్క చేయదు. ఇన్నాళ్ళూ ఆయన్ని తమ భుజాల మీద మోస్తోన్న యెల్లో మీడియా కూడా పట్టించుకునే పరిస్థితి వుండదు.
 
ఇవన్నీ తెలుసుకోలేనంత అమాయకుడైతే కాదు రఘురామ. కానీ, ఎందుకింత అత్యుత్సాహం.? ఆయన ధైర్యమేదో ఆయనకు గట్టిగానే వుండి వుండాలి. అదేంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే ప్రస్తుతానికి.