దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కూడా ఒకానొక సమయంలో 24 వేల పై చిలుకు కేసులు ఒక్క రోజులో నమోదైనా, ఆ తర్వాత గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. అయితే, అనూహ్యంగా ఆంధ్రపదేశ్ ప్రభుత్వం కరోనా టెస్టుల్ని తగ్గించేసింది. కారణమేంటన్నదానిపై భిన్న వాదనలు వున్నాయి.
ఇంకోపక్క రాష్ట్రంలో 6 గంటలు మినహా మిగతా సమయమతా కర్ఫ్యూ కొనసాగుతోంది. అయినాగానీ, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గాల్సిన స్థాయిలో తగ్గడంలేదు. నిన్న ఏడున్నర వేల పై చిలుకు నమోదైన కేసుల సంఖ్య, ఈ రోజు ఎనిమిదిన్నర వేలకు చేరింది. టెస్టుల సంఖ్య కాస్త పెరిగినా, కేసుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రధానంగా తూర్పగోదావరి జిల్లాలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఎక్కువగానే వుంటోంది చాలా రోజులుగా. రోజువారీ మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రజలు కరోనా నిబంధనలు సరిగ్గా పాటించకపోవడంవల్లే ఈ పరిస్థితి అన్న వాదనలున్నాయి. అదే సమయంలో, ప్రభుత్వం కూడా కర్ఫ్యూ నిబంధనల్ని కఠినంగా అమలు చేయడంలో విఫలమవుతోందన్న విమర్శలున్నాయి.
తాజాగా ఈ రోజు 8 వేల 766 కేసులు నమోదయ్యాయి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో. టెస్టుల సంఖ్య దాదాపు 93 వేలు. కాగా, తెలంగాణలో లక్షా ముప్ఫయ్ వేలకు పైగా పరీక్షలు జరుగుతున్నాయి ప్రతిరోజూ. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలకు అటూ ఇటూగా వుంటోంది. ఇదిలా వుంటే, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ నుంచి కొన్ని సడలింపులు వచ్చాయి.
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సడలింపులు వుంటాయి. అదనంగా మరో గంటపాటు జనం ఇళ్ళకు వెళ్ళేందుకు అవకాశమివ్వనున్నారు. మెట్రో రైళ్ళు, తెలంగాణలో వివిధ ప్రాంతాలకు నడిచే బస్సుల సమయాన్ని తదనుగుణంగా పెంచారు.