టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నెలలు గడుస్తోంది. ఇంతవరకు ఆ రాజీనామాపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు.. తీసుకుంటారన్న నమ్మకాలు కూడా ఎవరికీ లేవు. అసలు గంటా, చిత్తశుద్ధితోనే రాజీనామా చేశారా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇక, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులు రాజీనామా చేయడానికి సిద్ధంగా వున్నారంటూ సంచలన ప్రకటన చేసేశారు. కేంద్రం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయమై నిర్ణయం తీసేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తామని తేల్చి చెప్పేసింది.
దాంతో, టీడీపీ ప్రజా ప్రతినిథులు రాజీనామా చేసినా.. వైసీపీ ప్రజా ప్రతినిథులు రాజీనామా చేసినా.. కేంద్రం వెనుదిరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే, కేంద్రంలో బీజేపీ సంపూర్ణ బలంతో వుంది. ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు ఎంతలా గగ్గోలు పెట్టినా, కనీసం వాటిని పట్టించుకునేంత అవసరం కూడా బీజేపీకి లేదు. పరిపాలన చేతకానోడే ఆస్తుల్ని అమ్మేస్తాడని.. పాలకుల గురించి ప్రజాస్వామ్యవాదులు అంటుంటారు.
విశాఖ ఉక్కు విషయంలో అదే నిజమని అనిపించడం వింతేమీ కాదు. విశాఖ ఉక్కు.. ఆషామాషీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కలేదు. 30 మందికి పైగా ప్రాణ త్యాగాలతో వచ్చింది. అలాంటి ఉక్కుని కాపాడుకోవాలంటే రాష్ట్రానికి చెందిన రాజకీయ శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలి. ఏపీ బీజేపీ కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కానివ్వబోమని అంటోంది. ఇంకెందుకు ఆలస్యం, బీజేపీ అధిష్టానంతో ఏపీ బీజేపీ నేతలు కొట్లాడాలి.
ఇక, చంద్రబాబు అయితే.. రాజీనామాలు చేస్తాం.. అని చెప్పడం కాదు, చేసి చూపించాలి. ముగ్గురు లోక్ సభ సభ్యులతోపాటు, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసెయ్యాలి. కానీ, అంత చిత్తశుద్ధి చంద్రబాబుకి ఎక్కడిది.? విశాఖ ఉక్కు విషయమై ప్రధాని మోడీని చంద్రబాబు ఇప్పటిదాకా కనీసం ప్రశ్నించలేదాయె.