ఎస్ ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని యధావిధిగా కొనసాగించాలని గవర్నర్ బిశ్వబూషణ్ హరిచందన్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ సర్కార్ ఇప్పుడు గవర్నర్ ఆదేశాల్ని కచ్చితంగా పాటించక తప్పదు. తదుపరి చట్ట పరంగా ముందుకు వెళ్లాలన్నా! గవర్నర్ ఇచ్చిన సమయంలోపు నిమ్మగడ్డ నియామకం మాత్రం జరగాల్సిందే. సుప్రీంకోర్టులో కేసు విచారణ పూర్తికాక పోయినా… హైకోర్టు తీర్పులు పూర్తయినా ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎదురైంది. ఈ నేపథ్యంలో తాజాగా వైకాపా నేత శ్రీకాంత్ రెడ్డి గవర్నర్ ఆదేశాలపై స్పందించారు.
గవర్నర్ ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తామన్నారు. అలాగే నిమ్మగడ్డపై సంచలన ఆరోపణలు కూడా చేసారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎస్ ఈసీగా పరిగణించమని గవర్నర్ చెప్పారని గుర్తుచేసారు. అలాగే ఈ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి ఏం జరుగుతుందో? చూడాలని కూడా అనుమానం వ్యక్తం చేసారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్న విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోట్ల రూపాయలు ఫీజులు తీసుకునే లాయర్లను నిమ్మగడ్డ పెట్టుకున్నారని, ఆయనకు డబ్బు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆ డబ్బంతా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడా? అని అనుమానం వ్యక్తం చేసారు.
చంద్రబాబు తెర వెనుక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాజ్యంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ హోటళ్లలో రహస్యంగా రాజకీయ నేతలలో మంతనాలు జరపడం సరికాదన్నారు. అదీ ఎస్ ఈసీగా తొలగించబడిన తర్వాత నిమ్మగడ్డ ఎంపీలతో మంతనాలు దేనికని? దాని వెనుక జరిగిన కథేంటో? బయటపెట్టాలని డిమాండ్ చేసారు. ఇప్పుడా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. అలాగే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో కేసు ఉన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంపైనా ఆసక్తి సంతరించుకుంటోంది.