సిక్కోలు వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయ్.!

Srikakulam YSRCP Leaders

సామాజిక న్యాయ భేరీ పేరుతో వైసీపీకి చెందిన సుమారు 17 మంది మంత్రులు ఓ బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఈ యాత్రను ప్లాన్ చేశారు. యాత్ర అత్యద్భుతంగా సాగుతోందని వైసీపీ చెబుతోంది. కానీ, కింది స్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా వున్నాయి.

మాజీ మత్రి ధర్నాన కృష్ణదాస్, ‘నాకెందుకు లే..’ అనుకున్నారట. మరో వైసీపీ కీలక నేత సీదిరి అప్పలరాజు కూడా ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారట.. ఇలా శ్రీకాకుళం జిల్లా వైసీపీలో జోరైన చర్చ జరుగుతోంది. ఎందుకిలా.? వున్నంతలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రమే జిల్లాలో ఒకింత కష్టపడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలైన ఈ యాత్రకు సంబంధించి తొలి రోజు స్పందన దారుణంగా వుండడం వెనుక సిక్కోలు వైసీపీలో లుకలుకలే కారణమన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. జన సమీకరణ విషయంలో మొత్తంగా వైసీపీ నాయకత్వం ఫెయిల్ అయ్యిందని అంటున్నారు.

‘అబ్బే, అదేమీ లేదు.. వైసీపీలో ధిక్కార స్వరానికీ, అలసత్వానికీ తావు లేదు..’ అని పలువురు మంత్రులు పైకి గట్టిగా చెబుతున్నా, యాత్రకు జనం నుంచి వస్తున్న స్పందనేంటో ఆ జనానికే బాగా తెలుసు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో వున్న సమయంలో ఈ యాత్ర జరుగుతుండడం కూడా యాత్ర వైఫల్యానికి కారణంగా చెబుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకింత అసహనంతో వున్నారట.