ఓ పార్లమెంటు సభ్యుడ్ని పోలీసులు ఇంత కిరాతకంగా కొడతారా.? నమ్మేలా లేదిది. ఏపీ సీఐడీ మీద ఇప్పటికే చాలా ఆరోపణలు చేశాయి విపక్షాలు.. చేస్తూనే వున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతల విషయంలో ఒకలా, విపక్షాలకు చెందిన నేతలపై ఇంకోలా ఏపీ సీఐడీ వ్యవహరిస్తోందన్న వాదనలు.. రాజకీయాల్లో సర్వసాధారణం. ఇప్పుడున్న రాజకీయాల్లో పోలీసు వ్యవస్థ కఠిన పరీక్షనే ఎదుర్కొంటోంది. ఎవరు అధికారంలో వున్నా, పోలీసు వ్యవస్థనే బదనాం అయిపోతోంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. రఘురామ మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తే, అలా చాలా తీవ్రమైన అంశం.
పోలీసు ఉన్నతాధికారులకు ఆ విషయం తెలియదని ఎలా అనుకోగలం.? సో, రఘురామపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది జరిగి వుండకపోవచ్చు. మరి, గాయాలెలా అయ్యాయ్.? గాయాలైతే వున్నాయ్.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. డయాబెటిక్ పేషెంట్.. సోరియాసిస్ సహా అనేక రుగ్మతల పేరు చెప్పి.. అవి గాయాలు కావని ఎవరైనా అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. కావాలనే రఘురామ డ్రామా ఆడారన్నది అధికార పార్టీ వాదన. ఏఏజీ కూడా ఇదే వాదనను తెరపైకి తెచ్చారు. అంటే, రఘురామ తనంతట తానుగా గాయపర్చుకున్నారనా.? అలా గనుక ప్రభుత్వం ఒప్పుకున్నట్లయితే, అది ఇంకో సమస్య అవుతుంది.
పోలీసుల అదుపులో వున్న వ్యక్తి మీద ఈగ వాలినా.. దానికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. సో, ఇది చిన్న విషయం కాదు. చాలా చాలా పెద్ద విషయం. జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అంశం. వైద్య నివేదికలు వస్తే తప్ప, ఈ వ్యవహారంపై ఏదీ చెప్పలేని పరిస్థితి.