ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయం.? పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని భారతీయ జనతా పార్టీ ఎలా ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించింది.? దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వరాదనేది కేంద్రం తీసుకున్న విధానపరమైన నిర్ణయమని ప్రకటించాక, మళ్ళీ కొత్తగా పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇవ్వడమేంటి.? ఆంధ్రపదేశ్ ఈ విషయంలో ఏం పాపం చేసిందని బీజేపీ భావిస్తున్నట్లు.! ఆంధ్రపదేశ్ అంటే బీజేపీకి ఎంత చులకనభావమో, పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎన్నికల హామీ ఇవ్వడంతోనే అర్థమవుతోంది. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందాన తయారైంది బీజేపీ వ్యవహార శైలి ఈ విషయంలో. ఎన్నికల్లో గెలవడానికి ఏ గడ్డి తినడానికైనా రాజకీయ పార్టీలు వెనుకాడవని.. ఇలాంటి సందర్భాల్లోనే నిరూపితమవుతుంటుంది.
నిజానికి పాండిచ్చేరి అనేది పూర్తిస్థాయి రాష్ట్రం కాదు. అదొక కేంద్ర పాలిత ప్రాంతం. అక్కడ చాలా ప్రత్యేకతలుంటాయి.. సాధారణ రాష్ట్రాలతో పోల్చితే. మళ్ళీ ప్రత్యేకంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక హామీలు ఇవ్వడాన్ని.. అందునా ప్రత్యేక హోదా లాంటి హామీ ఇవ్వడాన్ని ఏమనుకోవాలి.? ఓ పక్క ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి వున్న హక్కుల్ని హరించి, లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అదనపు అధికారాలు కట్టబెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ, పాండిచ్చేరికి వరాలిచ్చేస్తామనడం హాస్యాస్పదమే. తిరుపతి ఉప ఎన్నిక వేళ, పాండిచ్చేరికి ప్రత్యేక హోదా అంశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. తెలంగాణలో పసుపు బోర్డు విషయంలోనూ ఇలాంటి చెత్త రాజకీయమే చేస్తోంది బీజేపీ. తెలంగాణలో వద్దు.. అదే పసుపు బోర్డు తమిళనాడులో అయితే ముద్దు.. అంటున్నారు కమలనాథులు. తెలుగు రాష్ట్రాల్లో తమకు అంత సీన్ లేదు సరే.. తమిళనాడులోనూ, పాండిచ్చేరిలో వెలగబెట్టే సీన్ ఏమైనా వుందా.? పాండిచ్చేరి, తమిళనాడు ఓటర్లు.. బీజేపీ నాటకాల్ని గుర్తించాలి. ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తామని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి విస్మరించారు మరి.