ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఇంకా వుందట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘అడుగుతూనే వుంటాం..’ అంటూ పదే పదే చెబుతున్న విషయం విదితమే. ఏడేళ్ళుగా అడుగుతూనే వున్నారుగానీ, ప్రత్యేక హోదా మాత్రం రాలేదు. మధ్యలో చంద్రబాబు, ప్రత్యేక హోదా దండగని చెప్పడం.. ఆ తర్వాత ప్రత్యేక హోదా కావాలంటూ ఆందోళనలు చేయడం తెలిసిన సంగతులే.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు నిరాహార దీక్ష చేశారు.. తమ ఎంపీలతో ప్రత్యేక హోదా కోసమంటూ రాజీనామా చేయించారు. అదే రాజీనామాస్త్రం ఇప్పుడెందుకు ప్రయోగించడంలేదని ప్రశ్నిస్తే, ‘రాజీనామా చేస్తే పార్లమెంటులో ప్రశ్నించేదెవరు.?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.
అయితే, ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ. కేంద్రం దిగి రావాలంటే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిపైకి రావాలి. కానీ, అది జరగని పని. ఇదిలా వుంటే, 2024లో ప్రత్యేక హోదా వచ్చే అవకాశముందంటూ ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
2024 ఎన్నిలకు ముందు ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంటుందనీ, భారతీయ జనతా పార్టీ అప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాగా చేసుకుని, ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందనీ బీజేపీ నుంచి లీకులు బయటకు వస్తున్నాయి. మిత్రపక్షం జనసేన పార్టీని ముందు పెట్టి, 2024 ఎన్నికల్లో ప్రత్యేక హోదాపై బీజేపీ తనదైన రాజకీయం చేయబోతోందట.
ఇది నిజమేనా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో బీజేపీ తన ఉనికిని చాటుకోవాలంటే ఇంతకు మించిన దారి ఇంకోటి లేదు. 2019 ఎన్నికల సమయంలోనే ఈ వ్యూహాన్ని అమలు చేయాలనుకున్నా, రాష్ట్రంలో ప్రజలు తమను నమ్మరేమో అన్న ఆలోచనతో బీజేపీ వెనక్కి తగ్గిందట.