గ్రేటర్ లో స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్

భారీ వర్షాలతో చిందర వందర గందరగోళంగా మారిపోయిన హైదరాబాద్ ను మళ్లీ మునుపటిలా తీర్చిదిద్దేందుకు పది రోజుల పాటు స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటంచింది. తీవ్ర ముంపుకు గురైన 235 కాలనీల్లో కొట్టుకు వచ్చిన వ్యర్థాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. నెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు నగరంలో 89,134 మెట్రిక్ టన్నుల చెత్తను, వ్యర్థాలను తొలగించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను మరో 10 రోజుల పాటు కొనసాగించనున్నట్లు తెలిపింది.

 

ఈ స్పెషల్ డ్రైవ్ కోసం ప్రత్యేకంగా వాట్సప్ నెంబర్: 97046 01866 ను ప్రకటించింది.  జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్ నెంబర్: 040-211 11 11 1కు కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. ఇందుకు అవసరం అయిన అదనపు సిబ్బందిని, అదనపు వాహనాలను సమకూర్చుకున్నట్లు వెల్లడించింది. మొత్తం 737 వెహికిల్స్ ను సమకూర్చుకున్నట్లు వెల్లడించింది. 177 జె.సి.బి లతో పాటు వందలాది టిప్పర్ల ఉపయోగిస్తున్నట్ల  వెల్లడించింది.

 

అంటువ్యాధుల నివారణకు చేపట్టిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో రూ. 5 కోట్ల 51 లక్షలను ఇప్పటి వరకు ఖర్చు చేసినట్లు తెలిపింది. అదేవిధంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను ఇంకా 10 రోజుల పాటు కొనసాగించేందుకు వినియోగిస్తున్న అదనపు వాహనాలు, సిబ్బందికి మరో రూ. 5 కోట్లు పైబడి ఖర్చు అవుతుందని తెలిపింది. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

త్వరలో గ్రేటర్ ఎన్నికలు ఉండడంతో ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు రాష్ట్ర సర్కారు వేగంగా పావులు కదుపుతోంది. ఈ అకాల వర్షాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండండతో కేసీఆర్ సర్కారు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సహాయక చర్యలు చేపట్టినట్లుగానే అంతే ధీటుగా పునరావాస కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించింది.