అదేమి విడ్డూరమో కానీ, మన రాధాకృష్ణకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ ను తలదన్నే అమరావతి, పూర్ణగర్భిణిలా పోలవరం రిజర్వాయర్, అత్యుత్తమ గుణసంపన్నులైన పోలీస్, రెవిన్యూ అధికారులు, అవినీతిపై సమరం, రాష్ట్రప్రయోజనాల కోసం ప్రతిరోజూ మమతాబెనర్జీని మించిపోయేలా చంద్రబాబు కేంద్రంతో చేసే యుద్ధం, ఒక్క నయాపైసా కూడా అప్పులు లేకుండా గలగలా మోగే ఖజానా, నాలుగుపాదాలమీద నడిచే న్యాయదేవత, ప్రజలలో నిత్యచైతన్యశీలత మాత్రమే కనిపిస్తుంటాయి. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్నీ వ్యవస్థలు చచ్చుబడిపోయినట్లు, నిర్వీర్యం అయిపోయినట్లు గోచరిస్తుంటాయి. అందుకే వారం వారం రాధాకృష్ణ గోచీ లేచిపోయేట్లు ఆర్తనాదాలు చేస్తూ చంద్రబాబు కరుణాకటాక్షం కోసం తపిస్తుంటారు. కోతికి కొబ్బరికాయ దొరికిన చందాన మొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టిన ప్రెస్ మీట్ లోని తనకు నచ్చే అంశాలను మాత్రమే గ్రహించి దాన్ని ఆధారంగా చేసుకుని చంద్రబాబు మినహా ఆంధ్రులు ఎంత చవటలో, సన్నాసులో తనదైన శైలిలో చెప్పడానికి కృషి చేశాడు. ‘పోలవరం పై వంచన” అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడంలో తన వంచనాశిల్పచాతుర్యం ఎంత అందంగా ఉంటుందో నగ్నంగా ప్రదర్శించారు ఈ వారం! కొన్ని అంశాలను చూసి తరిద్దాం!
*
“”””మనవాళ్లు ఎంత సన్నాసులో ఢిల్లీ వాళ్లకు తెలిసిపోయింది” అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు గానీ, ”మనవాళ్లు ఉత్తవెధవాయిలోయ్” అని కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర ద్వారా గురజాడ అప్పారావు దశాబ్దాల క్రితమే చెప్పించారు. “”””
మనవాళ్ళు ఎంత సన్నాసులోయ్ అని ఢిల్లీ వాళ్లకు ఇప్పుడు కొత్తగా తెలియడమేమిటి? అక్కడ కాంగ్రెస్ రాజ్యం ఉన్నా, బీజేపీ రాజ్యం ఉన్నా మనవాళ్ళు ఎప్పుడూ సన్నాసులుగానే రుజువు చేసుకుంటూనే ఉన్నారు అని చరిత్ర ఢంకా కొట్టి చెబుతున్నది. మద్రాస్ నుంచి మనవళ్లను తన్ని తరిమేసినపుడు కర్నూలులో శాశ్వత రాజధాని ఏర్పాటు చేసుకోకుండా, లేదా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడనో, విశాఖపట్నాన్నో రాజధానిగా చేసుకోకుండా ఎక్కడో తెలంగాణ లోని హైద్రాబాద్ చల్లని వాతావరణానికి, వైశాల్యానికి ముగ్ధులై అక్కడ భూములను కారుచౌకగా కొట్టేయడానికి, అక్కడి సంపదను దోచుకోవడానికి హైద్రాబాద్ ను రాజధానిగా చేసినపుడే మనవాళ్ళు ఒత్తి సన్నాసులని రుజువైంది. ఆ తరువాత రాష్ట్రం రెండుముక్కలు అవుతున్న వాస్తవం తెలిసీ కూడా ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టం ద్వారా సాధించుకోవాల్సిన వరాలను నిర్లక్ష్యం చేసి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కపటనాటకాలు ఆడుతూ ప్రజలను వంచించిన నాడే మనవాళ్ళు పరమ సన్నాసులని, చవటలని ప్రపంచం మొత్తం అర్ధం చేసుకుంది. ఆంధ్రాలో ఒళ్ళు బలిసిన కుబేరులు అందరూ హైద్రాబాద్ చేరి అక్కడ పరిశ్రమలు పెట్టుకుని, ఖరీదైన ప్రాంతాల్లో భూములను కబ్జాలు చేసి, రాజభవనాలు కట్టించుకుని సేదదీరుతూ సొంత ప్రాంతాన్ని అలక్ష్యం చేసిన నాడే మనవాళ్ళు అత్యంత చవటలు అని దేశం మొత్తం గ్రహించింది. సినిమా స్టూడియోలు, పెట్టుబడులు, పరిశ్రమలు, పెట్టుబడులు, అభివృద్ధి మొత్తం హైద్రాబాద్ లోనే కేంద్రీకరించి, తెలంగాణ సెంటిమెంటును అవహేళన చేస్తూ వారి మనసులను గాయపరుస్తూ వికటాట్టహాసాలు చేస్తూ సీమాంధ్రవాసులను వంచన చేసిననాడే మనవారంతా పరమ సన్నాసులని తేలిపోయింది. ఇప్పుడు కొత్తగా ఉండవల్లి చెప్పేది ఏమిటి? ఆనాడు పార్లమెంట్ తలుపులు మూసేసి, పెప్పర్ స్ప్రేలు కొట్టిననాడు ఉండవల్లి పార్లమెంట్ లోనే ఉన్నారు. “ఆంధ్రులు ఆరంభశూరులు” అన్న నానుడి ఈనాటిదా?
***
“”””ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 20 వేల కోట్ల రూపాయలకు మించి ఇవ్వబోమని తేల్చి చెబుతున్నా, ఇటు రాజకీయ పార్టీలలో, అటు ప్రజలలో కనీస స్పందన లేకపోవడం ఎవరికైనా ఆవేదన కలిగించక మానదు””””
అసలు 2014 నాటికి, అనగా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి పదహారు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయం మాత్రమే కలిగిన పోలవరం ప్రాజెక్ట్ రాత్రికి రాత్రే ఎందుకు వింధ్యపర్వతంలా మూడున్నర రెట్లు పెరిగింది అనే విషయం మాత్రం రాధాకృష్ణ చెప్పడు. ప్రాజెక్ట్ ఎంత ఎత్తు పెరిగినా, పునరావాసం పరిహారం ఎంత పెరిగినా, మరీ మూడున్నర రెట్లు పెరగడం ఏమిటి? అప్పుడు ప్రజలు ఎవరైనా స్పందించారా? ఈరోజు ప్రాజెక్ట్ అంచనావ్యయం కుదించినప్పటికీ ప్రజలు స్పందించడం లేదంటే ఆ ప్రాజెక్ట్ వ్యయాన్ని తన దోపిడీ కోసం చంద్రబాబు అమాంతంగా పెంచేశారు అన్న అభిప్రాయం ప్రజల మనస్సులో ఉండటమే. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పొందిన రాయపాటి సాంబశివరావు గారి కంపెనీ మోసం చెయ్యడంలో మొదటి వరుసలో ఉంటుందని ప్రజలకు స్పృహ ఉండటమే అందుకు కారణం. ఆ ప్రాజెక్ట్ ను చంద్రబాబు సర్వనాశనం చేశారని, జగన్మోహన్ రెడ్డి దాన్ని గాడిలో పెట్టడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ప్రజల్లో విశ్వాసం ఉండటమే కారణం తప్ప మరొకటి కాదు.
**
“”””ప్రధాన రాజకీయ పార్టీల బలహీనతలను అడ్డుపెట్టుకుని బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడటం దారుణం కాదా? ఈ వంచనలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి ఎంత బాధ్యత ఉందో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంది. ఇలాంటి సందర్భాలలో మిగతా దక్షిణాది రాష్ర్టాల స్పందనను గుర్తుకు తెచ్చుకుని అయినా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, మేధావులనబడే వారు సిగ్గుపడాలి.”””
హరే! అదేమిటి? అంటే కేవలం ఏడాదిన్నర క్రితమే అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వానికి అంత బాధ్యత ఉంటే, అంతకు ముందు ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన చంద్రబాబుకు బాధ్యత లేదా? అసలు పోలవరం ఒప్పందాలు చేసుకున్నది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కదా? చంద్రబాబు హయాంలో పోలవరం విషయంలో మోసం జరుగుతున్నదని ఆనాడు రాజకీయపార్టీలు, మేధావులనబడే వారికి తెలియదా? ఆనాడు లేని సిగ్గు ఈనాడు దేనికి?
***
“”””పోలవరం ప్రాజెక్టు మూలనపడబోతోందని తెలిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో పోరాటస్ఫూర్తి రగలకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటానికి అండదండలు అందించడమే కాకుండా, నాటి పోరాటానికి మార్గదర్శకత్వం చేసిన ఆంధ్ర ప్రాంత నాయకులు, ప్రజలలో ఆ స్ఫూర్తి ఏమైపోయిందో మరి! “”””
పోలవరం ప్రాజెక్ట్ మూలన పడబోతోందని కేంద్రం కానీ, రాష్ట్రం కానీ ప్రకటించాయా? పోలవరంను నిర్మించే బాధ్యత కేంద్రానిదే అని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, కేవలం కమీషన్లకు కక్కుర్తి పడి, దాన్ని కేంద్రం నుంచి లాక్కున్నది చంద్రబాబు కాదా? అంటే, అర్జంటుగా ఇప్పుడు రాధాకృష్ణ గారి పిలుపు విని ఆంధ్రులు అందరూ రోడ్లమీదికొచ్చి పోరాటం చెయ్యాలన్న మాట! నాడు తెలంగాణ సాయుధ పోరాటానికి మార్గదర్శకత్వం చేసిన ఆంధ్రప్రాంతపు కమ్యూనిస్టు నాయకులు…తమ వారసులుగా వచ్చిన నాయకులు చంద్రబాబు లాంటి బూర్జువా భావాలు కలిగిన నాయకుడికి బానిసలుగా మారుతారని, ఆయన విదిలించే బిస్కట్లకు ఆశపడి పోరాటస్ఫూర్తిని మర్చిపోతారని, బాధితుల తరపున కాకుండా యజమానుల తరపున పోరాడతారని ఆనాటి నాయకులు ఊహించి ఉండరు! అంతెందుకు? పోలవరం వంచన మీద రగిలిపోతున్న రాధాకృష్ణ, రామోజీరావులు ఉద్యమాన్ని ప్రారంభించి నాయకత్వం వహించవచ్చు కదా!
**
“”””నిజానికి ఉండవల్లికి వ్యవసాయ భూములు ఉన్నాయో లేదో కూడా డౌటే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి పోలవరం విషయంలో అన్యాయం జరుగుతున్నప్పటికీ నోరు మెదపడం లేదని ప్రజలు అనుకుంటున్నారని ఉండవల్లి తన మనసులోని మాటను బయటపెట్టారు.””””
జగన్ తన మీదున్న కేసులకు భయపడే రకం కాదని, అవన్నీ తప్పుడు కేసులని, అవేవీ కోర్టుల్లో నిలబడవు అని ఉండవల్లి గతంలో లక్షాతొంభై సార్లు బహిరంగంగానే ప్రకటించారు. నేను ఆయన్ను ఇంటర్వ్యూ చేసినపుడు కూడా ఇదేమాట స్పష్టంగా చెప్పారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు ఉమ్మడి రాజధాని హక్కుని వదులుకుని హైద్రాబాద్ వదిలిపెట్టి పారిపోయినట్లు జగన్ కూడా భయపడతాడని రాధాకృష్ణ నమ్మితే ఆయన మానసికస్థితిని అనుమానించాల్సిందే! సోనియా గాంధీనే ఎదిరించి పార్టీని, పదవులను కూడా వదిలేసి సొంతపార్టీ పెట్టుకుని ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి, తనమీద కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి దేనికీ భయపడే రకం కాదని రాధాకృష్ణకు తెలుసు. కానీ, ఆత్మవంచన చేసుకోవడం రాధాకృష్ణకు తప్పనిసరి తద్దినం మరి!
**
“”””సంక్షేమ పథకాలకు, ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం తన సొంత నిధులతో ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం అసంభవం. ఇంకెన్నాళ్లీ వికృత రాజకీయ క్రీడ అని ప్రజలే ఉద్యమించాలి. లేనిపక్షంలో రాజధాని అమరావతికి ఏ గతి పట్టిందో పోలవరానికి కూడా అదే గతి పడుతుంది.”””
ఓహో! చంద్రబాబు హయాంలో అమోఘంగా సంపదను సృష్టించి సంక్షేమ పథకాలకు, ఉద్యోగుల జీతాలకు, అమరావతి రైతులను సింగపూర్ పంపించడానికి ధారాళంగా ఖర్చు చేశారన్న మాట! ఐదేళ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, దిగిపోయేటపుడు కేవలం వందకోట్ల రూపాయల నిల్వను మాత్రమే ఉంచి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన చంద్రబాబు తన హయాంలో పోలవరాన్ని ఎందుకు సంభవం చేయలేకపోయారు?
**
“””భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎత్తు పెంపు నిర్ణయం తీసుకుని ఉంటారు. అయితే ఈ విషయాన్ని ఆనాడు ప్రభుత్వాధినేతగా గానీ, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా గానీ ఆయన బాహాటంగా చెప్పలేరు. అలా చెబితే ఎగువన ఉన్న రాష్ర్టాలు అభ్యంతరం చెబుతాయి. ఫలితంగా ప్రాజెక్టు వివాదాస్పదమవుతుంది. “””
ఓహోహో….అస్మదీయుడిని విమర్శించేటపుడు నవనీతంతో సుతారంగా చెంపలమీద రాపాడిస్తున్నట్లు! తస్మదీయుడిని విమర్శించేటపుడు మాత్రం గొడ్డుకారాన్ని నిప్పులతో కలిపి ఒళ్ళంతా కసకసా కసిదీరా రుద్దుతున్నట్లు చెయ్యడంలో రాధాకృష్ణ నిష్ణాతుడు! మరి ఇదే సూత్రం జగన్ కు మాత్రం వర్తించదా? జగన్ తీసుకునే నిర్ణయాలు కూడా ఎగువ రాష్ట్రాలకు అభ్యంతరకరంగా ఉంటాయని ఆలోచిస్తూ చాపకింద నీరులా తన పని పూర్తి చేసే యోచనలో ఉన్నారేమో అన్న ఆలోచన రాధాకృష్ణకు ఎందుకు రాదో మరి!
**
“””ఈ అవసరాన్ని అడ్డుపెట్టుకుని ప్రాజెక్టు అంచనా వ్యయం 55 వేల కోట్ల రూపాయలను మంజూరు చేయాల్సిందేనని జగన్‌రెడ్డి కేంద్రాన్ని నిలదీయవచ్చు గదా? అలా చేయలేకపోతున్నారంటే అవినీతి కేసులకు సంబంధించి జగన్‌రెడ్డి భయపడుతున్నట్టేనని భావించాల్సి ఉంటుంది. తనపై కేసులున్నా లెక్క చేయకుండా న్యాయవ్యవస్థనే ఢీకొంటున్న జగన్ కేంద్రంలోని పెద్దలను నిలదీయలేరా? అలా జరగడం లేదంటే కేంద్రప్రభుత్వ పెద్దలకు భయపడుతున్నట్టే కదా?”””
నిజానికి మోడీకి, జగన్ కు శత్రుత్వం ఉన్నా జగన్మోహన్ రెడ్డిని మోడీ ఏమీ చెయ్యలేరు. మోడీ మీద కేసీఆర్, మమతాబెనర్జీ లాంటివాళ్లు ఇప్పటికి వందలసార్లు నిప్పులు చెరిగారు. మోడీ వారి రోమాన్ని కూడా పెకలించలేకపోయారు. రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి అధికారం మోడీ దయాధర్మం కాదు. అది రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. కానీ, న్యాయవ్యవస్థ తలచుకుంటే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించగలరు. అలాని న్యాయవ్యవస్థనే నేరుగా ఢీకొట్టిన జగన్మోహన్ రెడ్డి మోడీకి భయపడతాడని రాధాకృష్ణ అనుకుంటే ఆయన అక్షరాలా పిచ్చివాడని మనం ఒక నిర్ణయానికి రావచ్చు. తనమీద అన్ని కేసుల విచారణ జరుగుతున్నప్పటికీ న్యాయవ్యవస్థలోని కొందరు అన్యాయమూర్తుల మీద యుద్ధం ప్రకటించిన జగన్ ఎక్కడ! న్యాయమూర్తులకు అర్ధరాత్రులు విందులు ఇస్తూ వారిని ప్రసన్నం చేసుకోవడానికి వంగివంగి నమస్కారాలు చేసే చంద్రబాబు ఎక్కడ! ఓటుకు నోటు కేసుకు భయపడి పోలవరాన్ని, ప్రత్యేకహోదాను మోడీ పాదాల ముందు చంద్రబాబు తాకట్టు పెట్టారని నాడు కొన్ని పత్రికలు, మేధావులు గగ్గోలు పెట్టలేదా రాధాకృష్ణ గారూ? మరీ అంత మతిమరుపైతే ఎలా?
**
“”””అదే నిజమైతే ”నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించలేను, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే ఫలానా గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాను” అని అయినా జగన్ హామీ ఇవ్వాలి.””””
పై మాటలను బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే చంద్రబాబు అధికారంలో ఉన్న అయిదేళ్లపాటు కేంద్రప్రభుత్వాన్ని ఎదిరించలేక, బానిసత్వం ప్రదర్శించి పోలవరాన్ని మట్టికరిపించాడన్న వాస్తవాన్ని. కేంద్రంలో అధికారం పంచుకునీ కూడా, అయిదేళ్ల వ్యవధిలో ఒక ప్రాజెక్టును పూర్తి చెయ్యలేని అసమర్ధతను తలచుకుని సీమాంధ్రులు కుమిలిపోవాల్సిందే. యాభై వేలకోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్ళలో పూర్తిచేసి కేసీఆర్ మీసం మెలేసారు! మరి అంత అనుభవం కలిగిన చంద్రబాబు కేవలం ఒక ఇటుక వేస్తె ఒక ఈవెంట్, ఒక పిల్లర్ కడితే ఒక ఈవెంట్, ఒక కాఫర్ డామ్ ను పూర్తి చేస్తే ఒక ఈవెంట్…ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని మోసం చేసిన విషయాన్ని ఎందుకు చాటిచెప్పరు రాధాకృష్ణ!
**
“””30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్న వ్యక్తి కీలక అంశాలలో మౌనంగా ఉంటే కుదరదు. రాజధానిని గందరగోళంలో పడేసిన వ్యక్తి, ఇప్పుడు పోలవరాన్ని కూడా మూలకు నెడితే ప్రజలు ఎంతోకాలం మౌనంగా ఉండరు. చట్టంలో స్పష్టంగా పేర్కొన్న పోలవరాన్ని కూడా సాధించుకోలేకపోతే మనవాళ్లు సన్నాసులని కేంద్రంలోని పెద్దలే కాదు.. ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా భావిస్తారు.”””
హయ్యో…ముప్ఫయి ఏళ్లపాటు ఉండాలని అనుకోవడం ఏమిటి? చంద్రబాబు గారు విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో పాతికేళ్ళు తానె ముఖ్యమంత్రిగా ఉంటానని మామగారికి వెన్నుపోటు పొడిచి అధికారలక్ష్మిని చెరపట్టిననాడు ప్రకటించలేదా? ప్రజలు పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉంచిన వాస్తవాన్ని విస్మరించి మళ్ళీ అధికారంలోకి రాగానే 2050 వరకూ మేమె అధికారంలో ఉంటామని విర్రవీగలేదా? మరో పాతికేళ్ళు మన కులం వారే అధికారంలో ఉండాలని నాటి సభాపతి కులసంఘం మీటింగులో చెప్పలేదా? ఎవరు అధికారంలోకి వచ్చినా తామే శాశ్వతంగా ఉంటామని నమ్ముతారు. వారు చేసే మంచిపనులను బట్టి వారి అధికారాన్ని ప్రజలు రెన్యువల్ చేస్తారు. నవీన్ పట్నాయక్, మాణిక్ సర్కార్, జ్యోతిబసు, నితీష్ కుమార్, నరేంద్ర మోడీ లాంటి వారికి ప్రజలు నాలుగైదుసార్లు అధికారాన్ని రెన్యువల్ చేశారు కదా! ప్రజారంజకంగా పరిపాలన సాగితే ముప్ఫయి ఏళ్లేమిటి ఖర్మ? నలభై ఏళ్లయినా జగనే అధికారంలో ఉంటారు. ప్రజలను పీడిస్తూ, రాష్ట్ర సంపదను దోపిడీ చేస్తే మరుసటి ఎన్నికల్లోనే చంద్రబాబును తరిమేసినట్లు తరిమేస్తారు. ఇది ప్రజాస్వామ్యం బాబూ!
**
“”””మిగతా ప్రభుత్వ శాఖలు పని చేస్తున్నాయో లేదో తెలియదు గానీ, పోలీస్ శాఖ మాత్రం ప్రభుత్వాధినేత సేవలో తరించిపోతోంది. ప్రభువులను సంతృప్తి పరచడానికై అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. పోలీస్ అంటే మహోత్కృష్టమైన సర్వీస్. ప్రజల కోసం పోలీసులు ప్రాణాలు పోగొట్టుకుంటారు. అలా ఎంతో మంది విధి నిర్వహణలో అసువులు బాసి అమరులయ్యారు. అలాంటి పోలీస్ శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్న కొంతమంది నీతిమాలిన అధికారుల చర్యల వల్ల మొత్తం పోలీస్ శాఖకే తలవంపులు వస్తున్నాయి.”””
హేమిటో పాపం! నిన్నగాక మొన్ననే దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎనభై నాలుగుకు గాను నలభై ఎనిమిది పాయింట్స్ తో అతిపెద్ద గుర్తింపు వచ్చింది. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ వారి నివేదిక ప్రకారం అభివృద్ధి, సుస్థిరత అంశాలలో దేశం మొత్తం మీద అత్యున్నత పరిపాలన సాగిస్తున్నవారిలో జగన్మోహన్ రెడ్డికి మూడో స్థానం లభించింది. మన రాధాకృష్ణ మాత్రం ఉష్ట్రపక్షిలా ఇసుకలో దాచిన తలకాయను పైకి తియ్యకుండా తాను చెప్పింది ప్రజలు నమ్మాలనుకుంటాడు అమాయకుడు! చంద్రబాబు మెప్పుకోసం ఎంత నీచమైన ఆరోపణలు చేయడానికైనా వెనుకాడడు! ఆయన ఆవేదన, బాధ ఇప్పట్లో తీరేవే కావు! చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు