Welcomed Radhika Apte : రాధికా ఆప్టే.. బాలయ్య హీరోయిన్ అనాలేమో ఈ ముద్దుగుమ్మని. ఎందుకంటే, తెలుగులో చేసిన రెండు సినిమాలూ బాలయ్యతోనే. మంచి టాలెంట్ వున్న నటే కానీ, వివాదాలకు కేరాఫ్ అడ్రస్. తెలుగులో చేసినవి రెండే సినిమాలు అయినా, తెలుగు ప్రేక్షకులు రాధికా ఆప్టేని బాగానే గుర్తు పెట్టుకుంటారు.
ఛాన్సు దొరికినప్పుడల్లా ఓ సౌత్ హీరో తనను గదిలోకి రమ్మన్నాడనీ, తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ విమర్శలు చేస్తుంది. అయితే, ఆ హీరో పేరు మాత్రం చెప్పదనుకోండి. ఆ హీరో వల్లనే ఈ అమ్మడికి సౌత్ సినిమాలపై అపనమ్మకం ఏర్పడిందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ సినిమాలతో ఓ మోస్తరు బిజీగా వున్న రాధికా ఆప్టే అక్కడ కూడా ఏవో కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే వుంటుంది. అయితే, తాజాగా అమ్మడి దృష్టి మళ్లీ సౌత్ సినిమాపై పడినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ సైతం సౌత్ సినిమా వైపే చూస్తోంది.
అందుకే అమ్మడు మనసు మార్చుకుందా.? లేక అంతకు ముందు తాను చేసిన విమర్శల్ని కప్పి పుచ్చుకోవడానికి కవరింగులిస్తోందా.? కాదట. ఇప్పుడు సౌత్ సినిమా ఎదుగుతున్న తీరు చూస్తే తన ఆలోచన తప్పని అర్ధమయ్యిందట. బాలీవుడ్‌లో కూడా కొందరు అలాంటోళ్ళే వున్నారట.
అంతమాత్రాన బాలీవుడ్ చెడ్డది కాదనీ, అలాగే టాలీవుడ్ కావొచ్చు కోలీవుడ్ కావొచ్చు.. మంచి సినీ పరిశ్రమలే అని ప్లేట్ ఫిరాయించేసింది రాధిక ఆప్టే. అంతా చెప్పింది కానీ, ఇంతకీ సౌత్‌లో రాధికని గదిలోకి రమ్మని అడిగిన హీరో ఎవరన్నది మాత్రం ఇప్పటికీ బయట పడలేదు. గడుసు పిల్లే.!