World Record: ఇటివల చైనాలో ముగ్గురు పిల్లల్ని కనటానికి అనుమతిచ్చింది అక్కడి ప్రభుత్వం. కానీ.. మావల్ల కాదు అంటూ మరునాడే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అలా ఉంది పరిస్థితి. కొందరైతే ఒకర్ని కనటానికే ఇబ్బందులు పడుతున్నారు. అటువంటిది ఓ మహిళ ఏకంగా ఒకే కాన్పులో 10 మంది పిల్లలకి జన్మనిచ్చింది అంటే ఎంత ఆశ్చర్యమో కదా..! ఆశ్చర్యమే కాదు.. ఎవరైనా ఈ విషయం తెలుసుకుని నోరెళ్లబెట్టాల్సిందే. అవును.. ఈ అద్భుతాన్ని చేసి చూపించిందో దక్షిణాఫ్రికా మహిళ. ఒకే కాన్పులో ఏడుగురు మగ శిశువులు, ముగ్గురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం వారంతా ఇన్ క్యుబేషన్ లో ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే..
దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాకు చెందిన గోసియామి తమారా సితోలే అనే 37 ఏళ్ల మహిళ రెండో కాన్పుకు వెళ్లింది. అప్పటికే మొదటి కాన్పులో కవల పిల్లలు ఉన్నారు. అయితే.. రెండో కాన్పులో మాత్రం ఆ సంఖ్య 5 రెట్లు పెరిగింది. నిజానికి ఆమె గర్భంలో 6గురు శిశువులు ఉన్నట్టు తొలుత డాక్టర్లు స్కానింగ్ చేసి చెప్పారు. అయితే.. మలి రిపోర్టుల్లో ఆ సంఖ్య 8గా తేలింది. కానీ.. ప్రసవంలో మాత్రం 10 మంది శిశువులు జన్మించారు. ఇదే అద్భుతంగా మారింది. ఇది చూసి వైద్యులే ఆశ్చర్యపోతున్నారు. ఆమె భర్త టెబోగో సిటెట్సీ మాత్రం మహాదానందంలో ఉన్నాడు. ఆనందంలో మాటలు రావడం లేదంటున్నాడు.
ఇటివల మేనెలలో మొరాకోలో ఒక మహిళ ఒకసారి 9 మంది శిశువులకు జన్మనివ్వడమే ఇప్పటికీ రికార్డు. కానీ.. గోసియామి ఆ రికార్డును బ్రేక్ చేసింది. సితోలే స్థానికంగా ఓ రిటైల్ స్టోర్ లో మేనేజర్ గా పని చేస్తోంది. పుట్టిన శిశువులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె భర్త మీడియాకు తెలిపాడు. విశేషమేంటంటే గోసియామి 7 నెలల 7 రోజులు మాత్రమే గర్భధారణలో ఉండి నెలలు నిండకుండానే వీరికి జన్మనిచ్చింది. కృత్రిమ గర్భధారణ కోసం జరిపే ట్రీట్ మెంట్ల వల్ల ఒక్కోసారి ఇలా ఎక్కువ సంఖ్యలో శిశువులు జన్మిస్తారని వైద్యులు అంటున్నారు. ఏదేమైనా.. గోసియామీ కొత్త రికార్డు నెలకొల్పింది. గిన్నీస్ రికార్డులో గోసియామి చోటు దక్కించుకుంటుందేమో చూడాలి.