భూమా కుటుంబ రాజకీయ జీవితం ముగిసినట్టేనా!!

తెలుగు రాజకీయాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి నంద్యాల , ఆళ్లగడ్డ వంటి ప్రాంతాల్లో రాజకీయాలను ఈ కుటుంబ సభ్యులు శాసిస్తున్నారు. అయితే భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల నుండి రాజకీయ వారసత్వం పొందిన వారి కుటుంబ సభ్యులు మాత్రం రాజకీయాల్లో తమ ముద్రను వెయ్యలేకపోతున్నారు. ఇప్పుడు ఆంధ్రపదేశ్ లో భూమా కుటుంబ రాజకీయ జీవితం పూర్తిగా నాశనం అయ్యేలా ఉంది. ఇప్పటికే ఆ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది.

పార్టీ క్యాడర్ ను కాపాడలేకపోయారు

భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు ఎన్నికల్లో అపజయం పొందినా కూడా పార్టీ క్యాడర్ ను ఎప్పుడు కోల్పోలేదు. కానీ వీరి రాజకీయ వారసత్వం పొందిన భూమా అఖిల ప్రియారెడ్డి, భూమా బ్రహ్మనందంలు విజయం విషయం పక్కన పెడితే కనీసం పార్టీ యొక్క క్యాడర్ ను కాపాడుకోలేకపోతున్నారు. భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించగానే కూతురు అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీడీపీలో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. ఇందుకు కారణం అఖిలప్రియ మంత్రిగా ఉండగా క్యాడర్ ను పట్టించుకోకపోవడమే అంటారు. తల్లి, తండ్రి స్థాయిలో నాయకత్వ పటిమను చూపలేకపోవడమేనన్నది వాస్తవం. వారి కూతురిగా అఖిలప్రియ ఆళ్లగడ్డను నిలబెట్టుకోవడంలో విఫలయమ్యారు. అలాగే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. కానీ మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

పార్టీ కూడా వాళ్ళను పట్టించుకోవడం లేదు

2019 ఎన్నికల్లో దాదాపు అన్ని ప్రాంతాలలో వైసీపీ ధాటికి టీడీపీ నాయకులు నిలబడలేకపోయారు. కానీ చాలామంది ఓటమి తరువాత పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చారు కానీ భూమా కుటుంబ సభ్యులు మాత్రం పార్టీ క్యాడర్ ను పూర్తిగా విస్మరించారు. దింతే ఇప్పుడు పార్టీ క్యాడర్ నుండి భూమా కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీ క్యాడర్ నుండి కూడా వ్యతిరేకత రావడంతో భూమా కుటుంబ సభ్యులను పార్టీ పెద్దలు కూడా పట్టించుకోవడం లేదు. అందుకే పార్టీలో కూడా కీలక పదవులు ఇవ్వడం లేదు. రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని విజయం సాధించిన వారు చాలామంది కానీ భూమా కుటుంబ సభ్యులు మాత్రం కుటుంబ ఖ్యాతిని కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. రానున్న రోజుల్లో భూమా కుటుంబ సభ్యుల రాజకీయ జీవితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.