ఓ వైద్యుడు కరోనా బారిన పడి, ప్రాణాపాయంలోకి వెళితే, అత్యవసరంగా అతని ఊపిరితిత్తుల్ని మార్చాల్సి వస్తే.. అందుకు అవసరమై నిధుల్ని సమకూర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకొచ్చారు. నిజానికి, అభినందించాల్సిన విషయమే ఇది. ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చవుతుంది ఆ వైద్యుడికి వైద్య చికిత్స కోసం. శ్రీకాకుళం జిల్లాకి చెందిన డాక్టర్ భాస్కరరావు పరిస్థితి ఇది. ఆయన ప్రకాశం జిల్లాలో వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి చొరవతో భాస్కరరావుకి ఊపిరి తిత్తుల మార్పిడి చికిత్స జరగడానికి మార్గం సుగమమైంది.
ఈ క్రమంలో డాక్టర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. అధికార పార్టీ నేతలు, ఈ విషయమై ముఖ్యమంత్రి ఘనతను ప్రచారం చేసుకోవడం మామూలే. కానీ, రాజకీయ ప్రత్యర్థుల వాదన ఇంకోలా వుంది. సినీ నటుడు సోనూ సూద్‌కీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ పోలిక తెస్తున్నారు. సోనూ సూద్ చేతిలో ఎలాంటి పదవీ లేకపోయినా, ఆయన దేశవ్యాప్తంగా వున్న ప్రజల్లో ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు ముందుకొస్తున్నాడు.. ఆయన అసలు పబ్లిసిటీ కోరుకోవడంలేదు.
నిజానికి, ప్రభుత్వాల బాధ్యత అది. ముఖ్యమంత్రి, ఓ ప్రైవేటు వైద్యుడికి నిధులు కేటాయించడం.. అదీ ప్రభుత్వ ఖజానా నుంచి కేటాయిస్తే, దానికెందుకు అంత పబ్లిసిటీ.? అన్నది వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల ప్రశ్న.ఏదో ఒక అంశాన్ని పట్టుకుని వైసీపీ మీదా, ముఖ్యమంత్రి మీదా విమర్శలు చేయాలన్న దుగ్ధ కాకపోతే, ఇలాంటి విషయాల్ని వివాదాలుగా మార్చడం ఎంతవరకు సబబు.? మరోపక్క, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన ప్రతి వైద్యుడికీ ఇలాంటి సాయం అందుతుందా.? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి ఎంత మేర సాయం చేయాలన్న విచక్షణ ముఖ్యమంత్రికి వుంటుంది. ప్రోటోకాల్స్ ప్రకారం సాయం అందించడానికి ప్రభుత్వ నిధులతోపాటు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచీ వెచ్చించడం అనేది ఆనవాయితీగా వస్తున్నదే.