ఈడీ విచారణ: సోనియా గాంధీకి ఏమవుతుంది..?

Sonia Gandhi

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ యెదుట కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరయ్యారు. కుమార్తె ప్రియాంక గాంధీ వెంటరాగా, సోనియా గాంధీ ఈడీ కార్యాలయానికి వెళ్ళారు. సుమారు మూడు గంటల పాటు ఆమెను ఈడీ అధికారులు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారించారు.

ఇంకోపక్క, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈడీ కార్యాలయాల యెదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేశాయి. ఎందుకబ్బా.? ఏమో, అదంతే.! మోడీ సర్కారు, ఈడీని కాంగ్రెస్ పార్టీ మీదకు ఉసిగొల్పిందనీ, సీబీఐ లాంటి విచారణ సంస్థలతో కాంగ్రెస్ నేతల్ని వేటాడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

ఇందులో వేట, వేధింపు.. లాంటి పెద్ద మాటలు ఎందుకు వాడాలట.? కేసులు నమోదవుతాయి.. సుదీర్ఘ కాలం విచారణలు సాగుతూ సాగుతూ వుంటాయ్. చాలా అరుదుగా ఆయా కేసుల్లో శిక్షలు పడుతుంటాయ్. వెంటనే బెయిల్, మళ్ళీ వ్యవహారం మామూలే.

మొన్నామధ్య రాహుల్ గాందీని కూడా ఇదే కేసులో ఈడీ విచారించింది. అప్పట్లో సోనియా ఆరోగ్యం బాగోక, విచారణకు హాజరు కాలేకపోయారు. ఇప్పుడు విచారణకు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్ రాద్ధాంతం చేయడానికేమీ లేదు, బీజేపీ ఓవరాక్షన్ చేయాల్సిన అవసరమూ లేదు.

దర్యాప్తు సంస్థల పట్ల ప్రజల్లో ‘చులకనభావం’ ఎప్పుడో ఏర్పడిపోయింది. కాంగ్రెస్ హయాంలోనే, ఈ తరహా దర్యాప్తు సంస్థల్ని ‘పంజరంలో చిలక’గా న్యాయస్థానాలే అభివర్ణించడాన్ని చూశాం. అలాంటి చిలకల్ని చూసి, వాటిని పంజరంలో బంధించిన కాంగ్రెస్ భయపడటమా.?