ప్రతి నెలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు ఎలా కడుతుంది.? అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి, ఓ సీనియర్ పొలిటీషియన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలేమాత్రం సబబుకాదు.
రాష్ట్ర ప్రభుత్వానికి నిధులెక్కడినుంచి వస్తాయో తెలియనంత అమాయకమైన స్థితిలో అయితే సోము వీర్రాజు వుండరుగాక వుండరు. ప్రజలు కట్టే పన్నుల్లోంచే ప్రభుత్వాల ఖజానాలు నిండుతాయి. అవి చాలనప్పుడు ఇతరత్రా మార్గాలు.. అంటే, అప్పులు చేయడం.. ఆస్తులు అమ్మడం, తాకట్టుపెట్టడం.. వంటివన్నీ జరుగుతాయి.
అప్పులు చేయడంలో కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్రాలకంటే ముందంజలో వుంది. ఇక, అమ్మకాల విషయంలో అయితే మోడీ సర్కార్ ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ సృష్టించేస్తోందాయె. అదంతా వేరే సంగతి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దుస్థితి ఎందుకు దాపురించిందన్న విషయమై ముందుగా చర్చ జరగాలి.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపంగా మారింది. ఆ విభజన పాపంలో బీజేపీకీ భాగం వుంది. విభజనతో ఆర్థికంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాల్సి వుంది. హోదా అన్నారు.. ప్యాకేజీ అన్నారు.. కానీ, ఏదీ లేదు.
ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చి వున్నా.. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి వున్నా.. రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించేదే కాదు. ఢిల్లీని తలదన్నలా అమరావతి వుండాలని ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో నినదించారు. ఏదీ, ఆ స్థాయి సాధ్యం కేంద్రం నుంచి ఎందుకు రాలేదు.?
బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, రాష్ట్రానికి సాయం చేయకుండా.. రాష్ట్రమెలా బాగుపడుతుంది.? బీజేపీ నేతలు కాస్త సోయనెరిగినవారిలా వ్యవహరిస్తే బావుంటుంది.