Somu Veerraju : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కడప జిల్లా వాసులపై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఎటు వైపు నుంచి ఎలాంటి అక్షింతలు పడ్డాయోగానీ, సోము వీర్రాజు మాట మార్చేశారు. తాను కడప జిల్లా వాసుల్ని హత్యలు చేసేవారని అనలేదనీ, వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావించే సందర్భంలో చేసిన వ్యాఖ్యలు వక్రీకరణకు గురయ్యాయనీ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.
ఇదిలా వుంటే, సోము వీర్రాజు వ్యాఖ్యల్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి వచ్చినందుకు కమలనాథులు విలవిల్లాడిపోతున్నారు. టీడీపీ రాష్ట్రంలో అడ్రస్ కోల్పోతున్న నేపథ్యంలో బీజేపీకి కాస్తో కూస్తో ప్రజాదరణ పెరుగుతుందనుకుంటే, సోము వీర్రాజు తీరు కారణంగా.. బీజేపీ ప్రతిష్ట దెబ్బ తింటోందని ఏపీ కమలనాథులు వాపోతున్నారు.
మొన్నామధ్య సోము వీర్రాజు, చీపు లిక్కర్ విషయంలో చేసిన కామెంట్ల తర్వాత, బీజేపీ అధిష్టానం సైతం డిఫెన్స్‌లో పడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కడప జిల్లా వాసుల్ని ఉద్దేశించి, ‘హత్యలు చేసేవాళ్ళకి విమానాశ్రయం కావాలా.?’ అని సోము వీర్రాజు వ్యాఖ్యానించి పెను వివాదానికి తెరలేపారు.
సోము వీర్రాజు వ్యాఖ్యల్ని అధికార వైసీపీ తీవ్రంగా పరిగణించింది. కడప విమానాశ్రయం ఎప్పుడో బ్రిటిష్ హయాంలోనే వుండేదనీ, అది ఎవరి భిక్షా కాదని వైసీపీ నేతలు అంటున్నారు. ఏపీ బీజేపీ నేతల తీరు వల్ల, దేశంలో అధికారంలో వున్న బీజేపీ అప్రతిష్టపాలవుతోందని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు.
మరోపక్క, సోము వీర్రాజు వ్యాఖ్యల్ని సమర్థించలేక, ఖండించలేక.. వక్రీకరణ.. అంటూ కొత్త నాటకానికి తెరలేపారు ఏపీ బీజేపీ నేతలు.