Somu Veerraju : బీజేపీ సీనియర్ నేత, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్వేదం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి మీద తనకు ఆశ లేదని చెప్పుకొచ్చారాయన. హాస్యం కాకపోతే, సోము వీర్రాజు ముఖ్యమంత్రి అవడమేంటి.? అసలు ఆయనకు అవకాశమే లేదు. సో, ఆయన ఆ పదవి గురించి ఆశపడతారనీ అనుకోవడానికి వీల్లేదు.
‘కాపు’ కోటాలో సోము వీర్రాజుకి బీజేపీ అగ్రతాంబూలమిచ్చిందనే చర్చ చాన్నాళ్ళుగా జరుగుతోంది. అబ్బే, అదేం లేదని అంటారు బీజేపీలో కొందరు నేతలు.. కానీ, ఖచ్చితమైన వ్యూహంతోనే సోము వీర్రాజుని, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది.
అలాగని, సోము వీర్రాజుని ఏపీ సీఎం అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం నిలబెడుతుందా.? ఆ అవకాశమే లేదు. అసలు బీజేపీకి, ఏపీ ముఖ్యమంత్రి పదవిపైనే ఆశల్లేవు. ‘పవన్ కళ్యాణే మా ముఖ్యమంత్రి అభ్యర్థి..’ అంటూ పలు సందర్భాల్లో సోము వీర్రాజు సహా పలువురు బీజేపీ నేతలు చెప్పుకున్నారు, చెబుతూనే వున్నారు.
బీజేపీ – జనసేన కలిసి ఏపీలో అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్‌కి దక్కుతుంది. కానీ, అది జరిగే పని కాదు. ఆ పరిస్థితే వస్తే, పవన్ కళ్యాణ్‌ని జాగ్రత్తగా తప్పించి, జనసేనతో తెగతెంపులు చేసుకుని, బీజేపీ ఇంకో వ్యూహం రచిస్తుందన్నది నిర్వివాదాంశం.
ఇదిలా వుంటే, సోము వీర్రాజు నేతృత్వంలో ఏపీ బీజేపీ ఏమాత్రం బాగుపడలేదనే రిపోర్ట్ బీజేపీ అధిష్టానానికి వెళ్ళిందట. దాంతో, సోము వీర్రాజుని తప్పించేందుకు ఢిల్లీ బీజేపీ నాయకత్వం సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. రేసులో మాజీ కేంద్ర మంత్రి పురంధరీశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఆ విషయం కాస్తా సోము వీర్రాజు దృష్టికి రావడంతోనే, సోము వీర్రాజు నిర్వేదంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకోవాలేమో.