బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవలే తన ఎమ్మెల్సీ పదవిని పూర్తి చేసుకున్నారు. ఆరేళ్ళ పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియడంతో, సోము వీర్రాజు తదుపరి ఏం చేయబోతున్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ పార్టీ తరఫున ఆంధ్రపదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్న సోము వీర్రాజుకి త్వరలో బీజేపీ అధిష్టానం మరో కీలక పదవి కట్టబెట్టబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమేంటంటే, ఆయనకు రాజ్యసభకు వెళ్ళేందుకు అవకాశం కల్పించబోతున్నారట. నిజానికి, ఎమ్మెల్సీగా సోము వీర్రాజుకి అవకాశం దక్కిందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణంగా.. అంటారు చాలామంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు మధ్య స్నేహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
సోము వీర్రాజుకి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి దక్కడం వెనుక పవన్ కళ్యాణ్ ప్రోద్భలం కూడా వుందంటారు కొందరు. సరే, జాతీయ పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో ప్రాంతీయ పార్టీ అధినేత పెత్తనం ఎత.? అన్నది వేరే చర్చ. నిజానికి, కన్నా లక్ష్మినారాయణ కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకీ, రాజ్యసభగానీ, మరో పదవిగానీ దక్కలేదు. అంతెందుకు, బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు సంగతేంటి.? ఆయన గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.. ఆయనకే రాజ్యసభ టిక్కెట్ దక్కలేదు. టీడీపీ హయాంలో ఆంధ్రపదేశ్ రాష్ట్రంతో సంబంధంలేని బీజేపీ నేత సురేష్ ప్రభుకి రాజ్యసభ పదవి ఇచ్చారు. వైసీపీ హయాంలోనూ పరిమల్ నత్వానీకి రాజ్యసభ పదవి దక్కింది. ఈ రెండూ బీజేపీ కోటాకి చెందినవే కావడం గమనార్హం. ఏపీ బీజేపీ నేతలకు మాత్రం ఇలాంటి అవకాశాలు దక్కకపోవడమేంటి.? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీకి చెందిన జీవీఎల్, వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్ళారు. ఆయన ఏపీ రాజకీయాల్లో పెద్దగా రాణించిందేమీ లేదనుకోండి.. అది వేరే సంగతి. మొత్తమ్మీద, సోము వీర్రాజుకి గనుక రాజ్యసభ అవకాశం దక్కితే, ఏపీ పట్ల కాస్తో కూస్తో బీజేపీకి ప్రేమ వున్నట్లే భావించాలేమో.