ఏపీ బీజేపీ కోవర్టులతో నిండిపోయి ఉందన్న మాట వాస్తవం. అందులో కొందరు లీడర్లు టీడీపీకి అనుకూలమైతే ఇంకొందరు వైసీపీకి మద్దతు. ఇరు వర్గాలు ఒకరిని మించి మరొకరు తమ పార్టీల కోసం తెర చాటు రాజకీయాలు బాగానే చేస్తున్నారు. వీరికి బీజేపీ అవలంభిస్తున్న ద్వంధ వైఖరి బాగా కలిసొస్తోంది. కాసేపు ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని, అడ్డుచెప్పబోమని వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే వారు ఇంకాసేపు టీడీపీ దారిలోకొచ్చి వైసీపీ మీద విరుచుకుపడుతుంటారు. ఈ విధానంతో బీజేపీ కలగాపులగం అయిపోయింది. కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీని పైకి లేపాలని ఎంత ట్రై చేసినా టీడీపీ, వైసీపీ ప్రో లీడర్ల వలన వీలుకావట్లేదు. అందుకే ముందు ఆ ప్రో లీడర్లను బయటికి పంపే పని పెట్టుకున్నారు వీర్రాజు.
ఇప్పటికే వెలగపూడి గోపాలకృష్ణను సస్పెండ్ చేసిన ఆయన తాజాగా మరొక అధికార ప్రతినిధి లంకా దినకర్ మీద వేటు వేశారు. లంకా దినకర్ ఒకప్పుడు టీడీపీలో చురుగ్గా ఉండేవారు. బీజేపీలోకి వచ్చాక కూడ ఆయనకు చంద్రబాబు పట్ల ఉన్న విధేయత తగ్గలేదు. బీజేపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా వాయిస్ వినిపించే వారు. అమరావతి అంశంలో బీజేపీ స్టాండుకు వ్యతిరేకంగా మాట్లాడారు. అందుకే ఆయన్ను పీకి పక్కనపెట్టారు. అయితే లంకా దినకర్, వెలగపూడి గోపాలకృష్ణ లాంటి వారు చి చిన్న ఎలుకలు. అసలైన ప్రో టీడీపీ పెద్ద ఏనుగులు వేరే ఉన్నాయి. చిన్నవాళ్లను పక్కనపెట్టడం వలన బీజేపీ నుండి టీడీపీకి అనుకూల వాయిస్ కట్ అవుతుందేమో కానీ అనుకూల ఆపరేషన్స్ మాత్రం జరుగుతూనే ఉంటాయి.
వాటిని పైకి తెలియకుండా తెరవెనుక నడిపేది ఆ ఏనుగులే. ఇంతకీ ఆ ఏనుగులు ఏవి అనుకుంటున్నారా.. అవే సుజనా చౌదరి, సీఎమ్ రమేష్ లాంటి వాళ్ళు. వీరిద్దరూ రాజ్యసభ సభ్యులు. కొంతకాలం క్రితమే టీడీపీ నుండి బీజేపీలోకి జంప్ అయ్యారు. అది కూడ చంద్రబాబు అనుమతితో. వాళ్లని పంపి మోదీ, అమిత్ షాలను ప్రసన్నం చేసుకోవాలనేది బాబుగారి ప్లాన్. మొదట్లో బాబు మీద సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చెయ్యటానికి వీరు బాగానే పనిచేశారు. ప్రస్తుతం కొంత నెమ్మదించినా తెర వెనుక చక్కబెట్టవలసిన కార్యాలను చక్కబెడుతూనే ఉన్నారు. వీరిది స్టేట్ లెవల్ కాదు. జాతీయ స్థాయిలో పరిచయాలు, పలుకుబడులు ఉన్న వ్యక్తులు. మంచి ఆర్థిక బలమున్న వ్యాపారవేత్తలు. వీరి అవసరం రాష్ట్ర బీజేపీకి లేకపోయినా కేంద్ర స్థాయి బీజేపీ నాయకులు కొందరికి ఉంది. అందుకే వాటి ఆటలు సాగుతున్నాయి. వీర్రాజుగారు పడితే ఇలాంటి ఏనుగుల్ని వలవేసి పట్టుకోవాలి. అప్పుడే రాష్ట్ర శాఖకు ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది.