ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము విర్రాజు నియామకమైన సంగతి తెలిసిందే. తొలిరోజు మీడియా సమావేశాల్లో నూతన అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా నిలిచారు. మూడు రాజధానుల అంశం సహా పలు ఆసక్తికర వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలనే ఒక్కసారిగా వేడెక్కించారు. ఏపీలో జనసేనతో కలిసి ఎలా ప్రయాణం చేయబోతున్నారు అన్న దానిపై కూడా సూచన ప్రాయంగా స్పందించారు. ఆ రాజకీయ విషయాలు పక్కనబెడితే సోము విర్రాజు గురువారం(నేడు) మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఇంట్లో మర్యాద పూర్వకంగా కలిసి చిరంజీవి ఆశర్వచనాలు పొందారు.
అనంతరం చిరంజీవి, అధ్యక్షుడిగా నియామకం అయినందుకు వీర్రాజుని అభినందించారు. ఇరువురు రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కేంద్ర-రాష్ర్ట రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఏపీ బీజేపీ ప్రయాణం బాగుండాలని, మంచి నిర్ణయాలతో రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో కలిసి పనిచేయాలని మెగాస్టార్ సూచించారు. జనసేన పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి జనసేనాని కలిసి ప్రయాణం ప్రారంభించారు. అధ్యక్షుడు మారడంతో నూతన సారథికి పవన్ శుభాకాంక్షలు తెలియజేసి రెండు పార్టీలు ప్రజల కోసం కలిసి పనిచేస్తాయని మరోసారి ఉద్ఘాటించారు. తాజాగా మెగాస్టార్ కూడా సోము వీర్రాజుని అభినందించడం విశేషం. అయితే నూతన సారథి ఉన్నట్లుండి మెగాస్టార్ ని కలవడం వెనుక అసలు కారణం అశీర్వదాలేనా? లేక రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా? అన్న అనుమానాలు పొలిటికల్ కారిడార్ లో చర్చకొస్తున్నాయి. ఈ భేటీలో చిరంజీవి బీజేపీ-జనసేన ప్రయాణం బాగుండాలని స్పందించడం విశేషం. ఇప్పటివరకూ చిరంజీవి నోట ఏనాడు జనసేన మాట రాలేదు. పవన్ తన ఎదురుగా ఉన్న పబ్లిక్ సమావేశాల్లో తను ఎంచుకున్న మరో రంగంలో సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించారే తప్ప జనసేన అని పేరు పెట్టి స్పందించింది లేదు.