ప్రజాసమస్యల పరిష్కారం కంటే ప్రత్యర్థుల విమర్శలకే ఎక్కవ ప్రయారిటీ ఇస్తున్నారు నెల్లూరు జిల్లా నేతలు. ప్రజలను పట్టించుకోవడం కంటే ప్రత్యర్థులను తిట్టి పోస్తేనే ఎక్కువ పాపులర్ అయిపోతామని బలంగా నమ్ముతున్నారు. ఒకానొక దశలో ఈమాటలు హద్దులు దాటి వ్యక్తిగతంగా పరువు పోగొట్టుకుంటున్నా వెనక్కితగ్గడం లేదు. విమర్శల్లో వెనకబడితే నవ్వులపాలవుతాం… ప్రజల ముందు చులకన అవుతాం అని అనుకుంటున్నారనే కాని…ఈ అవసరపు మాటలతోనే నిజంగా అన్ పాపులర్ అవుతున్నామని గుర్తించడం లేదు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి… టీడీపీకి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.
జిల్లాలో ఈసారి వరి బాగా పండింది. కాని అకాల వర్షాలతో కొంత ధాన్యం తడిసి పోయింది. రైతులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు కేసులు పెట్టారు. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి జోక్యం చేసుకొని కేసులు ఎత్తేయించారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న సోమిరెడ్డి రైతుల సమస్యలను తీర్చాలని కలెక్టర్ కు ఉత్తరాల మీద ఉత్తరాలు రాయడం మొదలు పెట్టారు. మరోవైపు కలెక్టర్ తో సంబంధం లేకుండా కాకాని ధాన్యం కొనుగోలు కేంద్రాల జాబితాను ప్రకటించేశారు. అధికారుల చేయాల్సిన పనిని కాకాని చేయనివ్వరు. అధికారులు ఏదన్నా చేద్దామనుకుంటే సోమిరెడ్డి అడ్డుపడతారు. ఇదీ పరిస్తితి. ఈ పొలిటికల్ న్యూసెన్స్ లో కొంత మంది వ్యాపారులు చాలా లాభపడుతున్నారు.
సోమిరెడ్డిని సోదిరెడ్డి అని కాకాణి విమర్శిస్తే.. కాకాణికి బూతులు తిట్టడంతో డాక్టరేట్ ఇవ్వాలని సోమిరెడ్డి ఆడిపోసుకుంటున్నారు. వీరిద్ధరి తిట్ల పురాణం ఎంత పెరిగిపోయిందంటే ధాన్యం కొనుగోలు అంశమే మరుగున పడిపోయింది.
రైతుల వద్ద తక్కువ ధరకే ధాన్యం కొని…. ఆ రైతులను కౌలుదారులుగా చూపించి కొంత మంది వ్యాపారులు అధికారుల సహకారంతో కుంభకోణానికి పాల్పడుతున్నారు. దాని మీద దృష్టి పెట్టాల్సిన ఈ ఇరువురు నేతలు… ఒకర్ని ఒకరు కించపర్చుకుంటూ రైతుల ముందు మరింత చులకన అయిపోతున్నారు. పరిధులు దాటి చేసుకునే విమర్శల వల్ల ఎవరికి లాభం చెప్పండి. మొత్తానికి ఏ ఇష్యూ మీద తిట్టుకుంటున్నారు… ఈ తిట్ల పురాణం కారణంగా ఆ ఇష్యూనే మరుగున పడిపోయింది. ఇలా సాగుతోంది నెల్లూరులో రాజకీయం.