యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యర్థుల మీద విమర్శల దాడి చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. వీలు దొరకాలేకానీ ఏ విషయాన్నైనా ప్రత్యర్థి పార్టీల మీద దాడి చేయడానికి వాడేస్తుంటారు. ఒకరు, ఇద్దరు అని కాదు చాలా మంది నేతలు తమ పార్టీ జోలికి వస్తే అంతే సంగతులు అనే భయం క్రియేట్ చేయడానికి తెగ ట్రై చేస్తుంటారు. అందుకు కారణం అధినేత వైఎస్ జగన్ దృష్టిలో పడాలనే తపనే. ఆ తపనే ఒక్కోసారి వైసీపీ లీడర్ల చేత అర్థం పర్థం లేని విమర్శలు చేయిస్తుంటుంది. తాజాగా కీలక నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి. తరచూ ప్రెస్ మీట్లు పెట్టి అపోజిషన్ పార్టీలను ఏకిపారేసే ఆయన కరోనా సోకడంతో క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది.
దీంతో మీడిమాకు ఆయనకు కొంత గ్యాప్ వచ్చింది. ఆ ఎడబాటును తట్టుకోలేకపోయారో ఏమో కానీ ఉన్నపళంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మీద ఇక విమర్శ వదిలితే బాగుంటుందని అనుకుని ట్విట్టర్లో ఇక ట్వీట్ వేశారు. అది కూడా స్వాతంత్య్ర దినోత్సవాన్ని బేస్ చేసుకుని కావడం గమనార్హం. పవన్, చంద్రబాబు ఇద్దరూ కోవిడ్ దృష్ట్యా ఏపీకి వచ్చే వీలు లేకపోవడంతో హైదరాబాద్లోనే జెండా ఎగురవేసి ఆగష్టు 15 వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. అదే అంబటిగారికి తప్పులా కనబడింది. అంతే ‘స్వాతంత్ర దినోత్సవ వేడుకలను స్వరాష్ట్రంలో జరుపుకోలేని చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందంటారా ?’ అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఇది చూసిన నెటిజన్లకు ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయినంత పనైంది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సొంత రాష్ట్రంలోనే చేసుకోవాలనే అంబటి రాంబాబుగారి ఆలోచన సరైంది కాదని, ఆగష్టు 15 రాష్ట్ర అవతరణ దినోత్సవం కాదని దేశ స్వాతంత్య్ర దినోత్సవమని, ఆ వేడుకను దేశంలో ఎక్కడైనా జెండా ఎగురవేసి జరుపుకోవచ్చని, పవన్, చంద్రబాబులు హైదరాబాద్లో జెండా వందనం చేయడంలో తప్పేముందని కౌంటర్లు వేశారు. పైగా స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన్ని కూడా ఇలా రాజకీయ విమర్శలు చేయడానికి వాడుకోవాలని అనుకోవడం మంచి పద్దతి కాదని అన్నారు. ఇంకొందరైతే ఎవరి సొంత రాష్ట్రాల్లో వారు ఆగష్టు 15 వేడుకలు చేసుకోవాలని మాట్లాడుతున్న అంబటిగారు ఏపీలో కరోనా బారినపడిన వైసీపీ నేతలు ఏపీలోనే చికిత్స తీసుకోకుండా పక్క రాష్ట్రానికి ఎందుకు పరుగులు పెడుతున్నారో చెప్పాలంటూ అంబటి స్టైల్లోనే వితండపు ప్రశ్నలు సంధిస్తున్నారు.