Small Movies : సినిమా అంటే సినిమానే. అది చిన్న సినిమానా.? పెద్ద సినిమానా.? అన్న తేడా థియేటర్లలోకి ప్రేక్షకుడు వెళ్ళాక అనవసరం. తెరపై నటీనటుల నటనా ప్రతిభ, కథాంశం.. ఇలాంటివాటి గురించే ప్రేక్షకుడు ఆశిస్తాడు. అయితే, ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే, సినిమాకి హంగులు అవసరం. అలాగని, ఆ హంగులు జోడిస్తే చాలు సినిమ హిట్టయిపోతుందనుకోవడమూ పొరపాటే.
ఇప్పుడిదంతా ఎందుకంటే, చిన్న సినిమాలు వర్సెస్ పెద్ద సినిమాలన్న చర్చ షురూ అయ్యింది గనుక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న సినిమాల్ని ప్రోత్సహిస్తామంటోంది. ఆ చిన్న సినిమాలు ఆడేందుకు వీలుగా థియేటర్లలో టిక్కెట్ల ధరలు తగ్గించామని చెబుతోంది. తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధరలు పెరిగాక, చిన్న సినిమాలు గుస్సా అయిన మాట వాస్తవం.
ఏటా నిర్మితమయ్యే సినిమాల్లో చిన్న సినిమాల వాటానే ఎక్కువ. చిన్న సినిమా హిట్టయితే వచ్చే లాభాలు చాలా చాలా ఎక్కువ. అదే పెద్ద సినిమా హిట్టయినా, ఒక్కోసారి లాభాలు రావడం కష్టమే.. అందుక్కారణం సినిమా బడ్జెట్. అయితే, థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే పెద్ద సినిమాలే కావాలి. ఆయా హీరోలే స్పెషల్ ఎట్రాక్షన్ అవుతారు మరి.
కారణం ఏదైనా, చిన్న సినిమా చితికిపోతోంది. చిన్న సినిమాని బతికించేందుకు జగన్ సర్కార్ నడుం బిగించడాన్ని అభినందించి తీరాల్సిందే. కానీ, వాటితో థియేటర్లు నడవడం కష్టం. నడవకపోతే ఎలా.? పెద్ద సినిమాలకూ ఉపశమనం కల్పిస్తేనే థియేటర్లు కళకళ్ళాడతాయి. ఈ సమస్యకు పరిష్కారం అంత తేలిక కాదుగానీ, ప్రస్తుతానికైతే చిన్న సినిమాలు ఆంధ్రప్రదేశ్ మీద ఆశలు పెంచుకుంటున్నాయనడం నిస్సందేహం.