లాక్ డౌన్ ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అనుభవం ఇస్తోంది. పెద్ద దర్శకులు చాలామంది సినిమాలను మధ్యలోనే నిలిపి ఉంచి సమయం కోసం ఎదురుచూస్తున్నారు. మీడియం రేంజ్ దర్శకుల పరిస్థితీ ఇలానే ఉంది. సినిమాలను లాంచ్ చేసి ఇక సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం అనే ప్రాజెక్ట్స్ కూడ నిలిచిపోయాయి. దీంతో చేసేది లేక వాళ్ళు కూడ లాక్ డౌన్ సడలింపుల కోసం వేచి చూస్తున్నారు. ఇక చిన్న దర్శకుల సిట్యుయేషన్ వేరేలా ఉంది. ఈమధ్యనే హిట్ అందుకుని కొత్త సినిమాలకు శ్రీకారం చుట్టాలని అనుకున్న యువ దర్శకులు చాలామంది సినిమాలను ఓకే చేసుకోకుండానే ఆగిపోవాల్సి వచ్చింది.
కొందరైతే ఆఫీసులు ఓపెన్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేయాలి అనుకునే సమయానికి ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. దీంతో వారంతా కొత్త మార్గం వెతుకుంటున్నారు. అదే ఓటీటీ ఫ్లాట్ ఫామ్. ప్రస్తుతం పెద్ద పెద్ద ఓటీటీ సంస్థలన్నీ ఫ్రెష్ అండ్ ఒరిజినల్ కంటెంట్ కోసం చూస్తున్నాయి. అందుకే ఖాళీగా ఉన్న యువ దర్శకులకు కబురు పంపుతున్నాయి. ఏదైనా వెబ్ సిరీస్ కథనో లేకపోతే వెబ్ ఫిల్మ్ కథనో ఉంటే తీసుకురమ్మని, ఇక నెల రోజుల్లో ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకుని వస్తే డబ్బులు పెట్టడానికి రెడీ అంటున్నాయి. దాంతో చిన్న డైరెక్టర్లు పలువురు ఖాళీగా ఉండటం ఎందుకు అనుకుని ఓటీటీ కథలను రెడీ చేసుకుంటున్నారు. కొందరైతే రెండు మూడు ప్రాజెక్ట్స్ ఓకే చేసి పెట్టుకున్నారు కూడ. సో.. ఈ లాక్ డౌన్లో పెద్ద దర్శకులు ఖాళీ అయి చిన్న దర్శకులు బిజీ అయిపోతున్నారు.