Sivaji Garuda Puranam : రాజకీయాల్లో ఎప్పుడూ గోడ దూకే నాయకులుంటారు. వాళ్ళూ వీళ్ళూ అన్న తేడాల్లేవ్. ఎవరైనా ఎప్పుడైనా జంప్ చేసెయ్యొచ్చు. నిఖార్సయిన రాజకీయ నాయకులు ఈ రోజుల్లో ఎక్కడున్నారు. ఇప్పుడున్నోళ్ళలో చాలామంది ‘కప్పల తక్కెడ’ వ్యవహారం రాజకీయ నాయకులే.
అసలు విషయమేంటంటే, వైసీపీ నుంచి 49 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీల్లోకి దూకేయడానికి సిద్ధంగా వున్నారని ‘గరుడ పురాణం’ శివాజీ సెలవిచ్చారు. అదేనండీ, సినిమాల్లేక రాజకీయాల్లో జోస్యం చెప్పుకుంటూ, చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న సినీ నటుడు శివాజీ గురించే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది.
అమరావతి రైతుల్ని కలిశారు తాజాగా సినీ నటుడు శివాజీ. హైకోర్టు అమరావతిపై ఇటీవల ‘సానుకూల తీర్పు’ ఇచ్చిన దరిమిలా, గరుడ పురాణం శివాజీ.. అమరావతిలో ప్రత్యక్షమైపోయాడు. అభివృద్ధి అంటూ ఏదన్నా జరిగితే చంద్రబాబు హయాంలోనూ, అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో తప్ప, వైఎస్సార్సీపీ హయాంలో అస్సలేమీ జరగలేదని శివాజీ చెప్పుకొచ్చాడు.
అయినా, శివాజీ మాటల్ని లెక్కచేసేదెవడు.? గతంలో ప్రత్యేక హోదా పేరుతో నానా యాగీ చేశాడు. ఆ తర్వాత గరుడ పురాణాన్ని తెరపైకి తెచ్చాడు. మధ్యలో ఓ ప్రముఖ ఛానల్ వివాదంలో ఇరుక్కుని, నానా పాట్లూ పడ్డాడు. వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబు చలవతో టైమ్ పాస్ రాజకీయాలు చేసే ‘గరుడ’ పురాణం శివాజీ, వైసీపీ ప్రజా ప్రతినిథులు గోడ దూకేయడానికి సిద్ధంగా వున్నారని ప్రకటించేశాడు సరే, వాళ్ళెవరో, వాళ్ళ వివరాలేంటో చెప్పడేం.?