‘కోవాగ్జిన్’పై కుల రాజకీయం: ప్రశ్నించాల్సింది కేంద్రాన్నే.!

Vaccination for 140 Cr, but when?
Caste Virus Around Covaxin
దేశంలో తయారవుతోన్న దేశీయ కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ మాత్రమే. కోవిషీల్డ్ అనేది భారతదేశంలో తయారవుతోన్న విదేశీ వ్యాక్సిన్. కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులే ఎక్కువగా అందుబాటులో వుంటున్నాయి. ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ నుంచి ఫార్ములా బదిలీ చేయాలనీ, ఎక్కువ చోట్ల, ఎక్కువ సంస్థలు ఈ వ్యాక్సిన్ తయారు చేస్తే, వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువమందికి టీకాలు అందుతాయని ఆంధ్రపదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. మంచి ఆలోచనే ఇది. కానీ, వ్యాక్సిన్ తయారీ సంస్థలకంటూ కొన్ని హక్కులంటాయి. దానికి లోబడే, కేంద్రం నిర్ణయాలు తీసుకోగలగుతుంది.
 
ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందాలు సహా, అనేక అంశాలు వ్యాక్సిన్ తయారీకి దోహదం చేస్తాయి కాబట్టి, అంత తేలిగ్గా ఫార్ములా బదిలీ అనేది జరగబోదు. ఇక, కోవాగ్జిన్ చుట్టూ ‘కమ్మ వాక్సిన్’ అనే ప్రచారం జరుగుతోంది. ఇది అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ఎందుకంటే, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు కోవాగ్జిన్ సరఫరా అవుతోంది. ఆయా రాష్ట్రాల్లో కోవాగ్జిన్ విషయమై ఎలాంటి కుల రాజకీయాలూ లేవు. కేవలం ఆంధ్రపదేశ్ రాష్ట్రానికే ఈ కుల పైత్యమేంటన్నది ఇప్పుడు అంతటా జరుగుతోన్న చర్చ. టీడీపీ చేస్తున్న రాజకీయం, దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపీ ప్రదర్శిస్తోన్న అత్యుత్సాహం వెరసి, ఏపీలోని కుల రాజకీయాల పట్ల దేశవ్యాప్తంగా ఏహ్యభావం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి రాజకీయాలు అత్యంత బాధాకరం. కోవాగ్జిన్, తెలుగు నేలపైనే తయారవుతోంది కాబట్టి, ఇక్కడే ఎక్కువ డోసులు అందించాలన్నదీ సమర్థనీయం కాదు. అలాగైతే, తెలంగాణకే కోవాగ్జిన్ టీకాలన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఇది దేశీయ టీకా. దేశమంతటికీ ఒకేలా అందుబాటులోకి రావాల్సి వుంటుంది.
 
పైగా, వ్యాక్సినేషన్ అనేది కేంద్రం పరిధిలోని అంశం. కేంద్రమే, పూర్తి నియంత్రణలో పెట్టుకుంది. దాంతో, వ్యాక్సిన్ విషయమై ఏ రాష్ట్రానికైనా, ఏ రాజకీయ పార్టీకైనా సందేహాలుంటే, ఆక్షేపణలుంటే.. నిలదీయాల్సింది కేంద్రాన్ని మాత్రమే.. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీని మాత్రమే.