పోలీసులు, అధికారంలో వున్నవారికి వత్తాసు పలకడం అనేది కొత్త విషయమేమీ కాదు. అలా పోలీసుల మీద ఓ ముద్ర వేసేయడం అన్నది ఎప్పటినుంచో జరుగుతున్న తంతు. పోలీసులు, ప్రభుత్వం తరఫున ప్రజల కోసం పనిచేయాల్సి వుంటుంది. ఈ క్రమంలో అధికార పార్టీ ‘ముద్ర’ ఖచ్చితంగా, పోలీసుల పనితీరుపై వుంటుంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఇది నిష్టుర సత్యం. చంద్రబాబు హయాంలో భూమా నాగిరెడ్డి ఎదుర్కొన్న రాజకీయ వేధింపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ వేధింపులు భరించలేక ఆయన తన కుమార్తె భూమా అఖిలప్రియతో సహా, టీడీపీలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంతకు ముందు ఆయన మీద నమోదైన పోలీసులు కేసులు, ఆయా ఘటనల గురించి ఒక్కసారి టీడీపీ నేతలు నెమరు వేసుకుంటే, తమ హయాంలో పోలీసు వ్యవస్థని ఎలా వాడుకున్నదీ వాళ్ళకే బాగా అర్థమవుతుంది.
ఇలాంటి గొప్ప గొప్ప ఘనకార్యాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట. స్వర్గీయ ఎన్టీయార్ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు, ఆ తీరు కారణంగా స్వర్గీయ ఎన్టీయార్ మానసిక క్షోభకు గురవడం.. ఇవన్నీ ఎవరికీ తెలియవనుకుంటే ఎలా.? టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ వ్యవహారంతో చంద్రబాబు మరో మారు కారాలూ మిరియాలూ నూరేశారు పోలీసుల మీద. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే, అది ప్రజాస్వామ్యబద్ధంగా వుండాలి. నిబంధనల్ని గాలికొదిలేసి.. ‘బస్తీ మే సవాల్..’ అంటే ఎలా.? పోలీసు వ్యవస్థ చూస్తూ ఊరుకోదు. ఒకవేళ, పోలీసులు చూస్తూ ఊరుకున్నా, ఆ తర్వాత పరిస్థితులు చెయ్యిదాటితే.. ఇదే టీడీపీ నేతలు మళ్ళీ పోలీసు వ్యవస్థ మీదనే నిందలేస్తారు. చంద్రబాబుకి అన్నీ తెలుసు. ఎప్పుడెలా రాజకీయం చేయాలో ఆయనకన్నా ఇంకెవరికి బాగా తెలుసు.? నేతలు అరెస్టయిన ప్రతిసారీ, పోలీసు వ్యవస్థ మీద చంద్రబాబు నోరు పారేసుకోవడం ఓ పరిపాటిగా మారిపోయిందంతే.