వైసీపీని భయపెడుతున్న ఆ సర్వేలో నిజమెంత.?

సోషల్ మీడియా వేదికగా ఓ సర్వే ప్రచారంలో వుంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఈ సర్వే వివరాల ప్రకారం చూస్తే, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడచిన రెండేళ్ళలో అత్యంత దారుణంగా బలహీనమైపోయింది. 60 మందికి పైగా ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశముంది. ఇందులో 9 మంది మంత్రులు కూడా వున్నారట. తమకు కంచుకోటల్లాంటివిగా భావిస్తోన్న కొన్ని నియోజకవర్గాల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు వైసీపీని వెంటాడనున్నాయట ఈసారి. సంక్షేమ పథకాల్ని జనం ఎంజాయ్ చేస్తున్నారు తప్ప, వాటి విషయంలో అధికార పార్టీపై ప్రజల్లో ప్రత్యేకమైన ఇష్టం ఏమీ పెరగలేదని సదరు సర్వే ఫలితాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ బలం.. కేవలం ‘వాపు’ మాత్రమేనని కూడా అర్థమవుతోంది. అయితే, ఇవన్నీ నిజాలేనా.? అంటే, ఖచ్చితంగా చెప్పడం కష్టం. వైఎస్సార్సీపీనే స్వయంగా చేయించుకున్న సర్వేలో వెలుగు చూసిన అంశాలివి.. అంటూ సర్వే వివరాల్ని సోషల్ మీడియాలో కొందరు సర్క్యులేట్ చేస్తున్నారు.

అదంతా అబద్ధం.. అని వైసీపీ శ్రేణులు కొట్టి పారేస్తున్నా, వైసీపీ అభిమానులు మాత్రం అందులోని అంశాల్ని చూసి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అధికారంలో వున్నవారెవరూ, తమ వైఫల్యాల్ని అంగీకరించరు. కింది స్థాయిలో పార్టీకి జరుగుతున్న నష్టాన్నీ, ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించలేరు. చంద్రబాబు హయాంలోనూ అదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. సర్వే నిజమా.? కాదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, వైసీపీకి డేంజర్ బెల్స్ అయితే మోగుతున్నాయి. కరోనా సంక్షోభం సహా కారణాలు బలంగానే వుండొచ్చుగానీ.. ఇవేవీ, ఎన్నికల వేళ ఓటర్లు అధికార పార్టీ మీద సానుభూతి కురిపించడానికి ఉపయోగపడవు. ప్రతినెలా కొత్త అప్పులు చేస్తే తప్ప, రాష్ట్రం గడవని పరిస్థితి రావడమంటే, దానిక్కారణం, అనుభవ రాహిత్యమేనన్న భావన జనంలోకి వెళ్ళిపోయింది. ప్రజలకు అన్నీ అర్థమయ్యేలా చెప్పాల్సిన అధికార పార్టీ పూర్తి వైఫల్యం చెందుతోంది.