Janasena : జనసేన పార్టీకి సంబంధించి మేధావి వర్గం నాయకుడిగా చెలామణీ అవుతోన్నవారిలో బొలిశెట్టి సత్యనారాయణ ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంటారు. మీడియాలో కూడా జనసేన భావ జాలాన్ని గట్టిగా వినిపిస్తుంటారు. చర్చా కార్యక్రమాల్లో జనసేన పార్టీ తరఫున తనదైన వాదనను వినిపిస్తుంటారు బొలిశెట్టి సత్యనారాయణ.
తాజాగా, సోషల్ మీడియా వేదికగా ఓ జనసైనికుడు (అధికారిక జనసైనికుడో లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానో..) ఓ సూచన చేశాడు, జనసేన పార్టీ బాగు కోసం. ‘నెలకి ఒక్కసారి అయినా ఒక బహిరంగ సభ వుండేలా చూడండి. మనం స్టీల్ ప్లాంటు వంటి విషయాల్లో ఎంత పోరాడినా, జనాల్లో కనబడకపోతే ఏం ఉపయోగం వుండదు. అర్థం చేసుకోగలరు. మీకు సలహా చెప్పే అంత అర్హత లేదు నాకు కానీ.. విన్నపం..’ అంటూ చెప్పుకొచ్చాడు.
దానికి బొలిశెట్టివారి రిప్లయ్ ఏంటో తెలుసా.? ‘సలహాలు మాని అధినాయకుడు చెప్పింది చేస్తే చాలనుకుంటా..’ అని. అధినేతను పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అనుసరించాల్సిందే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ఇది ప్రజాస్వామ్యదేశం. పార్టీల్లోనూ ఆ ప్రజాస్వామ్యం వుండి తీరాలి.
జనసైనికుడు చేసింది సూచన మాత్రమే. నిజానికి, అది మంచి సూచన కూడా. పార్టీ జనంలో వుండాలన్నది జనసైనికుడి సూచన. ఇందులో తప్పేముంది.? జనసైనికుల్లో చాలామంది భావన ఇదే. జనసైనికులు జనంలో వుండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది నాయకులూ జనంలో వుంటున్నారు. కానీ, అది సరిపోదు.. జనసేన పార్టీ అధికారంలోకి రావాలంటే.
అధినేత స్వయంగా రంగంలోకి దిగాలి. నెలకోసారి అయినా, జనంలో వుండాలి. దానికి బహిరంగ సభ అనే సూచన చేశాడు జనసైనికుడు. ఇలాంటి సూచనల్ని పాటించకపోతే, జనంలోకి జనసేన వెళ్ళడం, జనాన్ని ఆకట్టుకోవడం అనేది జరగని పని.