టీడీపీకి మ‌రో షాక్…గ‌ల్లా రాజీనామా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకి మరో గ‌ట్టి షాక్ త‌ప్పేలా లేదు. ఇప్ప‌టికే ఉన్న ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నేత‌ల‌తో పార్టీని నెట్టుకురాలేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. బుధ‌వార‌మే ఆ పార్టీ సీనియ‌ర్ నేత శిద్దా రాఘ‌వులు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైకాపాలో చేరి ఊహించ‌ని షాకిచ్చారు. స‌రిగ్గా స్థానిక ఎన్నిక‌లకు ముందు ఈ ఘ‌ట్టం చోటు చేసుకోవ‌డంతో చంద్ర‌బాబు తీవ్ర అస‌హ‌నాన్ని వెళ్ల‌గ‌క్కిన సంగ‌తి తెలిసిందే. పార్టీ మారిన వారంతా చ‌రిత్ర హీనులుగా మిగిలిపోతార‌ని…పార్టీ త‌ల్లి లాంటింద‌ని..అలాంటి త‌ల్లి క‌డుపునే త‌న్ని పోతున్నార‌ని మండిప‌డ్డారు. అలాంటి నాయ‌కుల్ని ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ క్ష‌మించ‌ర‌ని..ఎన్నిక‌ల్లో గెలిపించ‌ర‌ని త‌నదైన శైలిలో విమర్శ‌లు చేసారు. ఇంకా తేదాపాను వీడ‌టానికి చాలా మంది సీనియ‌ర్స్, ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో టీడీపీకి ఆయువు ప‌ట్టులాంటి నాయ‌కుడు గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా రాజీనామా దిశ‌గా ఆలోచ‌న చేస్తున్న‌ట్లు మ‌రోసారి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. వాస్త‌వానికి చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ పై పుత్ర‌వాత్స‌ల్యం అమితంగా చూపిస్తున్న‌ప్పుడు..పార్టీ ప్ర‌ధాన బాధ్య‌త‌ల్ని ఆయ‌న‌కే అప్ప‌గిస్తున్న‌ట్లు జ‌రిగిన ప్ర‌చారం స‌మ‌యంలోనే గ‌ల్లా రాజీనామా విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. కానీ పెద్ద‌గా ఫోక‌స్ కాలేదు. అయితే పార్టీ తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా అక్క‌డ నుంచి జంప్ అవ్వ‌డ‌మే మంచిద‌ని గ‌ల్లా భావిస్తున్నారని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది.

టీడీపీ లో ఉన్న ప్ర‌జా ప్ర‌తినిధులే చంద్ర‌బాబు మాట‌ను వ్య‌తిరేకించి మాట్లాడే వ‌ర‌కూ రావ‌డంతో పార్టీ భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతుందోన‌ని గ‌ల్లా అంచ‌నాకి వ‌చ్చే గుడ్ బై దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలిసింది. అయితే గ‌ల్లాని ఇంత‌గా ఆలోచ‌న‌లో ప‌డేయ‌డానికి మ‌రో కార‌ణం కూడా ప్రధానంగా వినిపిస్తోంది. గుంటూరులో చంద్ర‌బాబుకు స‌న్నిహితంగా ఉండేవారు, లోకేష్ స‌న్నిహితులుగా పిల‌వ‌బ‌డే వారు గుంటూరు లో ఎలాగైనా గ‌ల్లాని సైడ్ చేసే దిశ‌గా పావులు కదుపుతున్నారుట‌. ఈ విష‌యాన్ని గ‌ల్లా అదిష్టానం దృష్ట‌కి తీసుకెళ్లినా స‌రైన రెస్పాన్స్ రావ‌డం లేదు. ఇక ఏపీ పార్టీ బాధ్య‌త‌లు చిన‌బాబుకి అప్ప‌గించే ఆలోచ‌న‌లోనూ చంద్ర‌బాబు ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో పార్టీలో కొన‌సాగ‌డం అవ‌స‌రామా? అని విశ్లేషించుకుని పార్టీకి రాజీనామా చేసేస్తేనే బెట‌ర్ అని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు వినిపిస్తోంది. అదే జ‌రిగితే చంద్ర‌బాబుకు గ‌ట్టి షాక్ త‌ప్ప‌దు.