కరోనా మొదటి వేవ్ సమయంలో.. పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమల్లో వున్నాగానీ, రాష్ట్రాల మధ్య అంబులెన్సుల రాకపోకలకు ఇబ్బందులు రాలేదు. కానీ, అనూహ్యమైన నిర్ణయం తెలంగాణ పోలీసు అధికారులు తీసుకున్నట్టున్నారు ఈసారి. తెలంగాణలోకి ఆంధ్రపదేశ్‌కి చెందిన కరోనా రోగులు అంబులెన్సుల్లో రాకుండా కట్టడి చేస్తున్నారు. తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగుల్ని చేర్చుకునేందుకు అనుమతి వుంటే మాత్రమే, ఆంధ్రపదేశ్ నుంచి వచ్చే అంబులెన్సులకు దారి ఇస్తున్నారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో కలకలం రేగుతోంది. ‘ప్రాణాలు కాపాడుకునేందుకు వస్తున్నాం.. మమ్మల్ని అడ్డుకోవద్దు కేసీఆర్ సారూ..’ అంటూ అంబులెన్సులో తమ కుటుంబ సభ్యుడ్ని తరలిస్తున్న ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేయడం అందరికీ కంటతడి పెట్టించింది. అయితే, తలెంగాణలోని ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయిన దరిమిలా, కొత్తగా వచ్చే రోగులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్సుల్ని నిలువరిస్తున్నామనీ, అయితే ఆసుపత్రుల నుంచి అనుమతులున్న రోగుల్ని అడ్డుకోవడంలేదనీ పోలీసులు చెబుతున్నారు. ఎవరేం చెప్పినాగానీ, ఇది అనైతిక చర్య.. అమానవీయ చర్య. గతంలో, ఆంధ్రపదేశ్.. తెలంగాణ నుంచి వచ్చే సాధారణ ప్రయాణీకుల్ని కూడా అడ్డుకుంది. సవాలక్ష ఆంక్షలు పెట్టింది. అయినాగానీ, ఆంధ్రపదేశ్‌లోనే కరోనా పాజిటివ్ కేసులు అప్పట్లో ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడూ తెలంగాణ కంటే, ఆంధ్రపదేశ్ రాష్ట్రలోనే కరోనా పాజిటివ్ కేసులు రోజువారీగా చాలా ఎక్కువ నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పక్కన పెడితే, ఇలా అంబులెన్సుల్ని ఆపడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యం పరంగా హైద్రాబాద్.. అందరికీ పెద్ద దిక్కుగా వుంది.